Mark Zuckerberg: మీరు అనుభవించిన బాధ ఎవరికీ రాకూడదు..జుకర్ బర్గ్ పశ్చాత్తాపం

Mark Zuckerberg సమాచార విప్లవం వల్ల కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. అలాంటివే సామాజిక మాధ్యమాలు కూడా. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఎక్స్, వాట్సాప్, టిక్ టాక్..ఇలా ఎన్నో యాప్ లు స్మార్ట్ ఫోన్ లోకి ప్రవేశించాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : February 1, 2024 2:43 pm
Follow us on

Mark Zuckerberg: వెనుకటి రోజుల్లో.. ఎదుటి మనిషి గురించి సమాచారం తెలుసుకోవాలి అంటే ఉత్తరాలు మాత్రమే శరణ్యం. ఏదైనా అత్యవసర సమాచారం చేరవేయాలి అంటే ఒక మనిషిని ప్రత్యేకంగా పంపేవారు. ఆ తర్వాత కొంతకాలానికి ల్యాండ్ ఫోన్లు వచ్చాయి.. ఆ ఫోన్లు కూడా ఈ స్థాయిలో ఉండేవి కావు. ఊరికి ఒకటో, రెండో ల్యాండ్ ఫోన్లు ఉండేవి. అనంతరం కొద్ది రోజులకు కాయిన్ బాక్స్ ఫోన్లు వచ్చాయి.. ఎప్పుడైతే సెల్ ఫోన్ అనేది తెర పైకి వచ్చిందో.. అప్పుడే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సమాచార విప్లవం కొత్త పుంతలు తొక్కడంతో అరచేతిలో ప్రపంచం కనిపించే స్థాయికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎదిగింది. తినే తిండి నుంచి పడుకునే పడకదాకా ఇలా ప్రతి అంశం స్మార్ట్ ఫోన్ ఆధారంగానే జరుగుతోంది. ఒకరకంగా చెప్పాలంటే ఒక మనిషి జీవితాన్ని అరచేతిలో ఇమిడిపోయే ఫోన్ శాశిస్తోంది..

సమాచార విప్లవం వల్ల కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. అలాంటివే సామాజిక మాధ్యమాలు కూడా. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఎక్స్, వాట్సాప్, టిక్ టాక్..ఇలా ఎన్నో యాప్ లు స్మార్ట్ ఫోన్ లోకి ప్రవేశించాయి. ఇందులోనూ రోజుకొక మార్పు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోతుంది. మొదట్లో ఫోటోలు, వీడియోల షేరింగ్ మాత్రమే ఈ యాప్స్ ల్లో ఉండేది. ఆ తర్వాత ఇందులోనూ అనేక మార్పులు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అయితే రాను రాను ఈ సోషల్ మీడియా ప్రభావం అందరిపై తీవ్రమవుతోంది. ముఖ్యంగా చిన్నారులపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది. అయితే సోషల్ మీడియా చిన్నారుల భద్రతపై చూపిస్తున్న ప్రభావాన్ని దృష్టిలో పెంచుకొని అమెరికాలోని సెనెట్ విచారణకు ఆదేశించింది.

ఈ విచారణకు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఎక్స్, వాట్సాప్, టిక్ టాక్ డిస్కార్డ్, స్నాప్ చాట్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చట్టసభ సభ్యులు ఆయా సంస్థల ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వల్ల చిన్నారులపై పడుతున్న ప్రభావాన్ని నిరోధించడానికి మీరు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా ఫేస్బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్ పై సెనేట్ లోని చట్టసభ సభ్యులు ఒంటి కాలు పై లేచారు. “మీరు ఆవిష్కరించిన సామాజిక మాధ్యమం చిన్నారులపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది. వారు అందులో వచ్చే ఫీడ్ కు ఆకర్షితులవుతున్నారు. అందులో ఉండే చెడు వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.. ఇది రాను రాను ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియదు. ఇప్పటికే మీరు చేసిన పనికి మీ చేతులకు రక్తం అంటుకుని ఉంది” అంటూ చట్టసభ సభ్యులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మెటా సీఈవో ఆ సభ్యుల వైపు చూసి విచారం వ్యక్తం చేశారు. బాధిత చిన్నారుల తల్లిదండ్రుల వైపు చూస్తూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అనుభవించిన బాగా ఎవరికి రాకూడదు అంటూ వారికి క్షమాపణలు చెప్పారు. కాగా,
ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఎక్స్, వాట్సాప్, టిక్ టాక్ నుంచి చిన్నారులకు అపరిచిత వ్యక్తులు పంపే సందేశాలను నిషేధించే యోచనలో ఉన్నామని ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా ప్రకటించింది. అంతేకాదు ఈ వేదికలపై చట్ట వ్యతిరేక అంశాలను చర్చించే విధానాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా పిల్లల్లో ఆత్మ న్యూనతను తగ్గించేందుకు తగినన్ని మార్గాల కోసం అన్వేషిస్తున్నట్టు ఫేస్ బుక్ వివరించింది. అంతేకాదు అందరూ వాడుకునే విధంగా సామాజిక మాధ్యమాలలో మార్పులు, చేర్పులు పేర్కొన్నది.