KCR- BRS: తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టిన పార్టీ టిఆర్ఎస్. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో కెసిఆర్ దేశ రాజకీయాలకు వెళ్లాలి అనుకుంటున్నారు. అయితే ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ని గత దసరా సందర్భంగా జాతీయ రాజకీయాలకు అనువుగా భారత రాష్ట్ర సమితి అని మార్చారు. దీనికోసం పార్టీ సభ్యుల ఏకాభిప్రాయానికి మొన్నటితో గడువు ముగిసింది. దీంతో ఆ లేఖను టిఆర్ఎస్ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించగా.. అది పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎన్ భార్ తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కెసిఆర్ కు లేఖ రాశారు. ఆ లేఖ కాపీలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులకు పంపారు. పార్టీ పేరు మారుస్తూ నిర్దేశిత సమయంలో నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో వెల్లడించారు. అయితే టిఆర్ఎస్ పేరును బీ ఆర్ ఎస్ గా మారుస్తూ అక్టోబర్ 5న టీఆర్ఎస్ పార్టీ సంయుక్త సమావేశంలో తీర్మానం చేశారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని నవంబర్ 7న పబ్లిక్ నోటీసు జారీ అయింది.. ఆ గడువు మొన్నటితో ముగిసింది. అయితే దీనిపై ఒక అభ్యంతరం వచ్చినప్పటికీ కేంద్ర ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదు.

కొంత ప్రక్రియ మిగిలి ఉంది
కేంద్ర ఎన్నికల కమిషన్ రాసిన లేఖకు కెసిఆర్ బదులు లేఖ పంపిస్తారని, ఆ తర్వాత పార్టీ పేరు మారుస్తూ సీఈసీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తుందని టిఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. టీ ఆర్ ఎస్ పేరును బీ అర్ ఎస్ గా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ అధికారికంగా పేరు మార్పు కోసం ఇంకా కొంత ప్రక్రియ మిగిలే ఉంది. సిఈసి రాసిన లేఖకు ఎక్నాలెడ్జ్ చేస్తూ మళ్లీ లేఖ రాయల్సి ఉంటుంది. ఆ లేఖ అందిన తర్వాతే పార్టీ పేరును బీ అర్ ఎస్ గా మారుస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేస్తుంది. ఆ తర్వాత తెలంగాణ సీఈవో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను బీఆర్ఎస్ గా మారుస్తూ నోటిపై చేస్తారు. తర్వాత టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ (లోక్ సభ, శాసన సభ) లెజిస్లేటివ్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మారుస్తారు. ఆ నోటిఫికేషన్ పై లోక్ సభ, రాజ్యసభ, అసెంబ్లీ సెక్రటరీలు అడాప్ట్ చేస్తూ బులిటెన్ ఇష్యూ చేస్తారు.. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభ పక్షం పేర్లు బీఆర్ ఎస్ గా మారిపోతాయి.
నేడు ఆవిర్భావ సభ
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సమావేశాన్ని శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహిస్తారు. దీనికి టిఆర్ఎస్ లోని అందరు ముఖ్య నాయకులు హాజరవుతారు.. ఇక కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమాధానం ఇస్తూ రాసే లేఖ పై కెసిఆర్ సంతకం చేస్తారు.. అనంతరం సీఈసీకి పంపిస్తారు.. ఆ తర్వాత పార్టీ జెండా, పతాకం ఆవిష్కరిస్తారు. భారత రాష్ట్ర సమితి పోషించబోయే భూమిక, భవిష్యత్తు కార్యాచరణ పై కెసిఆర్ ప్రసంగిస్తారు.

డిసెంబర్లో మహారాష్ట్రలో సమావేశం
భారత రాష్ట్ర సమితికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఓకే చెప్పిన తర్వాత ఇదే నెలలో మహారాష్ట్రలో భారీ సమావేశం నిర్వహించాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన క్షేత్రస్థాయి పనులు మొత్తం రైతు సంఘాల ప్రతినిధులు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి సరిహద్దులుగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భారత రాష్ట్ర సమితి ప్రస్థానం ప్రారంభించాలని కెసిఆర్ ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే.. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉండటం తో.. అక్కడ భారీ సమావేశానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.. జెడిఎస్ తో కలిసి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తరపున అభ్యర్థులను పోటీలోకి దింపే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ఇక వచ్చే ఏడాది ప్రథమార్దంలో ఢిల్లీలో భారీ బహిరంగ సమావేశం నిర్వహించేందుకు కెసిఆర్ యోచిస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఏ వ్యూహంతో టిఆర్ఎస్ వెళ్తుంది అనే దానిపై శుక్రవారం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంటుందని టిఆర్ఎస్ ముఖ్య నాయకులు చెప్తున్నారు. గుజరాత్ లో బిజెపి గెలిచిన ఒక్క రోజు తర్వాత కెసిఆర్ బీ ఆర్ ఎస్ పై కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.