Mahesh Babu -Namrata Shirodkar: మహేష్ వైఫ్ నమ్రత శిరోద్కర్ వ్యాపార మెళకువలు తెలిసిన మహిళ. పిల్లలు గౌతమ్, సితార పెద్దవాళ్ళు అయ్యాక నమ్రత మహేష్ కి వ్యక్తిగత సహాయకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆయన సినిమాలు, ఎండార్స్మెంట్ చూసుకుంటున్నారు. అలాగే ఆయన సంపాదన వ్యాపారాల వైపు మళ్లిస్తున్నారు. కొన్నేళ్లుగా మహేష్ వ్యాపారాల మీద దృష్టి పెట్టారు. ఏఎంబీ సినిమాస్ ప్రారంభించారు. ఏఎంబీ సినిమాస్ లో మూవీ చూడడానికి ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. మంచి మూవీ ఎక్స్పీరియన్స్ పంచే హంగులతో ఏఎంబీ సినిమాస్ రూపొందించారు. మహేష్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి, నిర్మాతలుగా మారారు.

అలాగే ది హంబుల్ కో అనే ఒక గార్మెంట్ బ్రాండ్ స్టార్ట్ చేయడం జరిగింది. తాజాగా మహేష్ హాస్పిటాలిటీ బిజినెస్ లో అడుగుపెట్టారు. ఏషియన్ గ్రూప్ భాగస్వామ్యంతో ఏషియన్ నమ్రత రెస్టారెంట్స్ స్టార్ట్ చేశారు. సౌత్, నార్త్, ఇండియన్, కాంటినెంటల్, చైనీస్… ప్రపంచంలో ఆహార ప్రియులు కోరుకునే ప్రతి వంటకం ఇక్కడ లభిస్తుంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో అధికారికంగా ఈ హోటల్ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా నమ్రత శిరోద్కర్ మీడియాతో మాట్లాడారు. హాస్పిటాలిటీ బిజినెస్ స్టార్ట్ చేయాలనేది అంకుల్ కృష్ణ గారి కోరిక. ఆయన ఆశీస్సులతో మేము ఈ రంగంలో అడుగుపెట్టాము. ఈ బిజినెస్ పట్ల మహేష్ సైతం చాలా హ్యాపీగా ఉన్నారు. అంకుల్ కృష్ణ బ్లెస్సింగ్స్ తో మేము ఈ రంగంలో విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది, అన్నారు. ఇక పిల్లలు గౌతమ్, సితారలకు ఇష్టమైన ఫుడ్ ఏమిటని నమ్రతను మీడియా ప్రతినిధులు అడగడం జరిగింది.

గౌతమ్, సితార హైదరాబాద్ బిర్యానీ చాలా ఇష్టంగా తింటారు. అలాగే మహేష్ కి కూడా బిర్యానీ ఫేవరెట్ ఫుడ్. నాకైతే పొంగలి చాలా ఇష్టమని నమ్రత చెప్పుకొచ్చారు. కాగా ఏషియన్ నమ్రత రెస్టారెంట్స్ మెనూ కార్డ్ బయటకు వచ్చింది. చిన్న చిన్న ఐటమ్స్ రేట్లు కూడా వందల రూపాయల్లో ఉన్నాయి. సామాన్యులకు అందుబాటులో లేని ఈ మెనూ కార్ట్ చూసి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ధరలు ఎలా ఉన్నా మహేష్ బ్రాండ్ నేమ్ తో ఈ హోటల్ సక్సెస్ కావడం ఖాయం.