తెలంగాణా ప్రజలు అమాయకులు. పైకి కనబడే దంతా నిజమేనని భ్రమిస్తుంటారు. ఎందుకంటే సీదా సాదా గా ఆలోచిస్తారు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళు అని నమ్మటం వాళ్లకు అలవాటు. తెరచాటు కౌటిల్యం బొత్తిగా తెలియదు. ఈ సంగతి బాగా తెలిసిన కెసిఆర్ దానికి తగ్గట్టు పావులు కదపటంలో ఆరితేరిన దిట్ట. రాజకీయ చాణిక్యుడు. ఇటీవలి కాలంలో త్వరితగతిన మారుతున్న రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలో తనకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. తనకు ఎప్పటికైనా బిజెపి నే పోటీదారు అని కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదని గ్రహించాడు. అయితే బిజెపి కి ప్రధాన ఆయుధం ఏదో తెలుసుకొని దానికి ప్రతిగా వ్యూహాలు పన్నటం తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు.
Also Read : అబ్బా.. ఏం చెప్తిరి.. అన్యాయాలపై సరెండరేనా?
బిజెపి తెలంగాణా లో ప్రధానంగా తెరాస పై ఎక్కుపెట్టిన అస్త్రం మజ్లీస్, ఒవైసీ ఏమి చెబితే కెసిఆర్ అది చేస్తాడని తెలంగాణా రిమోట్ కంట్రోల్ ఒవైసీ చేతిలో వుందని . అందుకే కెసిఆర్ దానికి ప్రతి వ్యూహాన్ని అమలు చేసాడు. అసెంబ్లీ లో మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ కెసిఆర్ ని విమర్శించటం ఆ వ్యూహంలో భాగమే. ఇది ఇద్దరికీ ఉభయతారకం. అసెంబ్లీ లో పివి నరసింహారావు కి భారత రత్న ఇవ్వాలని కెసిఆర్ బిల్లు పెట్టటం మజ్లీస్ కి ఇబ్బందికర మైన సంఘటనే. అందుకే సభ నుంచి వాకౌట్ చేసింది. దానితో తెరాస మిత్రపక్షమైనా ఇటువంటి విషయాల్లో తెరాస కి మద్దత్తు ఇవ్వబోమని చెప్పినట్లయ్యింది. దానితో దాని వర్గాన్ని సంతృప్తి పరిచినట్లయ్యింది. అలాగే తెరాస కి ఇది ఇంకో విధంగా ఉపయోగపడింది. బిజెపి విమర్శించినట్లు మేము మజ్లీస్ ఏమి చెబితే దానికి తలూపమని, రిమోట్ కంట్రోల్ అసలే కాదని పరోక్షంగా చెప్పినట్లయ్యింది. ఇటువంటి రాజకీయాలు నెరపటం లో కెసిఆర్ కి మించిన నాయకుడు ఇంకొకరు లేరు.
బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణా రాజకీయాలు కొత్త ఒరవడి లో నడుస్తున్నాయి. ముక్కు సూటిగా వెళ్ళటమే కాకుండా , కింద కార్యకర్తల మనోభావాలు బాగా తెలిసిన వ్యక్తి. కాకపోతే ఇప్పటికీ ఉత్తర తెలంగాణాలోనే బిజెపి తన స్థానాన్ని పదిలపరుచుకుంది. దక్షిణ తెలంగాణాలో హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతం లో నామమాత్రం గానే వుంది. మిగతా పార్టీల నుంచి నాయకులు చేరినా పెద్దగా ప్రయోజనం కలగలేదు. వచ్చే జి హెచ్ ఎం సి ఎన్నికల్లో తమ సత్తా చాటాలని పట్టుదలగా వున్నాడు. అందుకే ఇప్పట్నుంచే కెసిఆర్ తనదైన శైలి లో పాచికలు పన్నుతున్నాడని అనుకుంటున్నారు. పోయినసారిలాగా మజ్లీస్ తో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోకుండా రహస్య పొత్తు తో ఎన్నికలబరిలోకి దిగుతాడా లేక ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటాడా అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికయితే మేము మజ్లీస్ తో మమేకమవటం లేదనే సంకేతాలు ఇస్తున్నట్లుగానే అనుకోవాలి. జి హెచ్ ఏం సి ఎన్నికల్లో అలాగయితేనే బిజెపి ని దెబ్బ తీయొచ్చని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకొద్ది రోజులు పోతేగానీ మరింత క్లారిటీ రాదు.
Also Read : రూ.300 కోట్లు టు రూ.1200 కోట్లు.. కేసీఆర్ ఆడింది ఆట?