TRS vs BJP- Sharmila: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర ఘట్టాలు చోటుచేసుకుంటున్నాయి. వరి ధాన్యం కొనుగులు విషయంలో టీఆర్‌ఎస్ బీజేపీ మధ్య మొదలైన జగడం ప్రస్తుతం విచారణ సంస్థలను రంగంలోకి దింపి ప్రతీకార చర్యల వరకు చేరింది. అంతటితో ఆగకుండా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలపై నోటీసులు జారీ చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేతల కార్యక్రమాలకు అనుమతుల పేరుతో అడ్డంకులు సృష్టిస్తోందని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు కమలనాథులు. నువ్వా నేనా అంటున్నట్టు కొనసాగుతున్న కమలం, గులాబీ రాజకీయ జగడంలోకి ప్రస్తుతం వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్.షర్మిళ ఎంట్రీ ఇచ్చారు.

పాదయాత్రలో పదనిసలు..
తెలంగాణలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తరుచుగా ఇరుకున పెట్టే కాంగ్రెస్ పార్టీని వెనక్కు నెట్టి బీజేపీ తన ప్రభావాన్ని చాటుకుంటోంది. రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలే కాకుండా సీఎం చంద్రశేఖర్‌రావు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా బీజేపి కార్యచరణ రూపొందిస్తోంది.
గులాబీలో గుబులు..
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీల ఎత్తుగడలకు అంతగా ప్రాముఖ్యతనివ్వని సీఎం చంద్రశేఖర్‌రావు బీజేíపీ తీసుకుంటున్న కార్యాచరణకు మాత్రం కాస్త జంకుతున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర బీజేపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇందిరా పార్కులో సీఎం చంద్రశేఖర్‌రావు స్వయంగా దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఐటీ, ఈడీ దూకుడు గులాబీ నేతల్లో గుబులు రేపుతోంది.
నువ్వా.. నేనా..
అంతటితో ఆగకుండా తెలంగాణలో బీజేపీ ప్రజాదరణకు పోటీగా తమ కార్యక్రమాలను కూడా చంద్రశేఖర్‌రావు మార్చుకుంటున్నారు. బీజేపి గట్టి పోటీ ఇచ్చే క్రమంలో తన పరిధిని విస్తరించుకునేందుకు టీఆర్‌ఎస్‌గా కొనసాగుతున్న పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా రూపొందించారు. అంతే కాక తెలంగాణలో ప్రజా మహాసంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ తలపెట్టిన యాత్రకు శాంతిభద్రతల పేరుతో అనుమతులను నిరాకరిస్తూ బీజేపికి ఇబ్బందికర పరిస్థితులను కల్పించే ప్రయత్నం చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలతో బీజేపి వర్సెస్ టీఆర్‌ఎస్ రాజకీయాలు వాడివేడిగా కొసాగుతున్నాయి.
పాదయాత్రకు పర్మిషన్ చిచ్చు..
తెలంగాణలో పాదయాత్రల సీజన్ కొనసాగుతోంది. మొన్నటి వరకూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, అంతకు ముందు బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర, ఇక ఇప్పటికే కొనసాగుతున్న షర్మిళ మహాప్రస్తానం పాదయాత్రతో తెలంగాణ రాజకీయం ఊపుమీద ఉన్నట్టు చర్చ జరుగుతోంది. కాగా బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రను నిర్మల్ జిల్లా భైంసా నుంచి ప్రారంభించేలా రూపకల్పన చేశారు. అయితే యాత్రకు కొన్ని గంటల ముందు శాంతిభద్రతల అంశంతలెత్తే అవకాశం ఉన్నందున అనుమతులు ఇవ్వలేకపోతున్నామని పోలీసులు తేల్చి చెప్పడంతో పాటు బండి సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నామంటూనే బీజేపీ నాయకులు న్యాయస్థానం నుంచి అనుమతులు తెచ్చుకుని పాద యాత్ర చేస్తామని బీజేపి స్పష్టం చేసింది. సరిగ్గా ఇదే సమయంలో షర్మిళ పాదయాత్రలో కూడా పదనిసలు చోటుచేసుకున్నాయి.

కమలంతో ఢీ అంటున్న కారు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో షర్మిళ యాత్రకు ప్రతిష్టంభన నెలకొంది. సీఎం చంద్రశేఖర్‌రావుతోపాటు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని వైఎస్.షర్మిళ ఘాటుగా విమర్శించారు. అనేక ఆరోపణలు ఎక్కుపెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన గులాబీ శ్రేణులు నర్సంపేట సమీనంలో షర్మిళ ఫ్లెక్సీలకు నిప్పంటించడంతోపాటు ఆమె సేదతీరే వాహనాన్ని కూడా తగలబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్ధితి అదుపుతప్పే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు షర్మిళను అదుపులోకి తీసుకుని లోటస్ పాండ్ లోని తన నివాసంలో విడిచిపెట్టారు. దీంతో హోరా హోరీగా సాగుతున్న కమలం–గులాబీ రాజకీయాల్లోకి షర్మిళ ఊహించని ఎంట్రీ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది