TRS Plenary Meeting: హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. హైటెక్స్ లో సోమవారం నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీకి అన్ని జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు రానున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 10.30 వరకు ప్రతినిధుల పేర్లు నమోదు చేసుకుంటారు. 11 గంటలకు ప్లీనరీ ప్రారంభం కానుంది. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులు సుమారు ఆరు వేల మంది వరకు పాల్గొంటారు.

ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రాంగణమంతా గులాబీమయం అయిపోయింది. ప్రజాప్రతినిధులు బస చేయడానికి అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ మంత్రులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కరోనా కారణంగా ఇన్నాళ్లు ప్లీనరీ సమావేశాలు నిర్వహించలేదు. ప్రస్తుతం నిర్వహించడంతో అందరు విధిగా హాజరయ్యేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ డీసీపీ విజయ్ కుమార్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ట్రాఫిక్ నిబంధనలు తెలియజేశారు. వాహనాలు పలు రూట్లలో మళ్లించారు. నీరూస్ జంక్షన్, సైబర్ టవర్ క్రాస్ రోడ్స్, మెటల్ చార్మినార్, గూగుల్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్, ఖానామెట్ జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్ జంక్షన్ ల దగ్గర వాహనాలను మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.
మియాపూర్, కొత్తగూడ, హఫీజ్ పేట్ నుంచి హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ కు వెళ్లే వాహనదారులను రోలింగ్ హిల్స్, ఏఐజీ ఆస్పత్రి, ఐకియా, ఇనార్బిట్, దుర్గం చెరువు మీదుగా పంపిస్తున్నారు. ఆర్సీపురం, చందానగర్ నుంచి మాదాపూర్, గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలు బీహెచ్ఈఎల్, నల్లగండ్ల, హెచ్ సీయూ, ఐఐఐటీ, గచ్చిబౌలి వైపు పంపుతున్నారు.