AP Politics:మన చంద్రాలు సార్ ఎంతైనా గ్రేట్. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పని అయిపోయిందనుకుంటున్న వారికి షాకిస్తూ అధికారంలో కూర్చున్న వైసీపీని ఇంటా బయటా చెడుగుడు ఆడేసేలా అష్టదిగ్బంధనం చేసేస్తున్నాడు మన చంద్రబాబు. అసలు ఉనికి లేని చోట ఊటబావిని తవ్వేస్తున్నాడు. మొన్నటివరకూ ఏపీ సీఎం జగన్ , వైసీపీ సర్కార్ తో పోరాడి ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన జనసేనకు, పవన్ కు గట్టి షాకిస్తూ ఇప్పుడు ఆ స్థానాన్ని మళ్లీ చంద్రబాబు కైవసం చేసేసుకున్నారు.

నిన్నటిదాకా ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్టుగా చంద్రబాబు రాజకీయం సాగుతోంది. ఎడారిలో ఒయసిస్సులా పార్టీకి అందినప్పుడల్లా జీవం పోసే చంద్రబాబు ఎత్తుగడ టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మొన్నటివరకూ జనసేనాని పవన్ కళ్యాణ్ వీరావేశాన్ని చూశాం. రిపబ్లిక్ మూవీ వేడుకలో పవన్ ఏపీ ప్రభుత్వంపై సంధించిన ప్రశ్నలు.. ఆ తర్వాత వైసీపీ కౌంటర్లు, తాజాగా శ్రమదానంతో ఏపీ రోడ్ల దుస్థితిని ఎలుగెత్తి చాటిన వైనం చూశాక.. ఏపీలో టీడీపీ పని అయిపోయిందని జనసేన దాన్ని ఆక్రమించేసిందని అంతా అనుకున్నారు.
కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది. ఉనికి లో లేని టీడీపీకి కొత్త ఊపిరి వచ్చింది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఏపీ డ్రగ్స్ దందా విషయంలో జగన్ ను, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేయడం.. అది టీడీపీపై దాడుల వరకూ వెళ్లడం.. చంద్రబాబు 36 గంటల దీక్షతో ఏపీలో పరిస్థితి మారిపోయింది. టీడీపీలో కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రజల్లో చంద్రబాబు, టీడీపీపై సానుభూతి కురిసింది.
40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబుకు రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్నీ తెలుసు. అందుకే అంతగా రాజకీయాలను ఆయన శాసిస్తుంటాడు. ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీపై కోర్టుకెక్కుతూ, ఫిర్యాదు చేస్తూ.. కేంద్రంతో దబాయిస్తూ నానా హంగామా చేస్తున్నారు. వైసీపీ సర్కార్ ను ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేసేస్తున్నారు.
జనసేనాని పవన్ యాక్టివ్ అయ్యి ఏపీ ప్రతిపక్ష పాత్రకు ఎదుగుతున్నాడన్న సమయంలో వైసీపీ చేసిన దాడులను చంద్రబాబు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఆ పొగను మరింత అంటించి నిప్పు రాజేసి ఏపీలో ప్రజల్లో సానుభూతిని కొట్టేశారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అని చాటిచెప్పారు. చంద్రబాబు రాజకీయాలు ఇంత వేగంగా మార్చేస్తారని.. పోయిన చోటే వెతుక్కోవడం.. రాబట్టుకోవడం బాబుకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదని చెబుతున్నారు.