హుజూరాబాద్ ఉప ఎన్నిక గులాబీ పార్టీలో గుబులు రేపుతోందా? అంటే.. అవును అనే అంటున్నారు విపక్ష నేతలు, పరిశీలకులు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ గుండెల్లో.. ఒకే ఒక ఉప ఎన్నిక దడ పుట్టిస్తోందని అంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికతో ఆగమాగం అవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తన చర్యల ద్వారా ఈ విషయాన్ని బయట పెట్టుకుంటున్నారని చెబుతున్నారు. ఆయన పర్యటనలు, హామీలే ఈ విషయాన్ని చాటి చెబుతున్నాయని విశ్లేషిస్తున్నారు.
హుజూరాబాద్ కోసమే ‘దళిత బంధు’ పథకాన్ని తెచ్చామని స్వయంగా కేసీఆర్ ప్రకటించుకోవడం.. దాన్ని సమర్థించుకోవడం.. మేకపోతు గాంభీర్యాన్ని తలపిస్తోందని అంటున్నారు. ఇక, నియోజకవర్గంలోని వారు అడగడమే ఆలస్యం అన్నట్టుగా పింఛన్లు, రేషన్ కార్డులు వంటివి అందిస్తున్నారు. ఇవి మంజూరు చేయడం తప్పుకాదు. కానీ.. కేవలం ఎన్నిక జరుగుతున్న నియోజకవర్గానికి మాత్రమే వరాలు ప్రకటించడం.. అధికారికంగా ఓట్లను కొనుగోలు చేయడం మినహా.. మరొకటి కాదని విమర్శిస్తున్నారు.
ఆ నియోజకవర్గానికి చెందిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కన్ఫామ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ పదవి కూడా అక్కడి నేతకే ఇచ్చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఆ నియోజకవర్గానికే చెందిన బండా శ్రీనివాస్ కు కట్టబెట్టారు. ఇక, కేసీఆర్ హామీలు ఇవ్వడం మినహా.. చేసేదేమీ ఉండదని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి వంటివి కళ్లముందు కనిపిస్తున్నవే. అందుకే.. దళిత బంధును నెరవేరుస్తానని చెప్పేందుకు పాత హామీల దుమ్ము దులుపుతున్నారని అంటున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గుప్పించిన హామీలు కూడా.. హుజూరాబాద్ ఎన్నికవేళ గుర్తు రావడం.. హుటాహుటిన వాటి అమలుకు నిధులు ప్రకటించడం కేసీఆర్ పరిస్థితికి అద్దం పడుతోందని అంటున్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని, ఆ పార్టీకి 30 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని కోమటిరెడ్డి సర్వే రిపోర్టు చెప్పారు. ఈటల రాజేందర్ కు 60 శాతానికి పైగా ఓట్లు వస్తాయని చెప్పారు. అటుచూస్తే.. ఈటల 20 ఏళ్లుగా నియోజకవర్గంలో పాతుకుపోయి ఉన్నారు. అందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉన్నారు. మంత్రివర్గం నుంచి ఆయన్ను తప్పించినప్పుడు కేసీఆర్ ను ధిక్కరించి మరీ 90 శాతం మంది ప్రజాప్రతినిధులు ఈటల వెంట నిలవడం గమనించాల్సిన అంశం.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే.. హుజూరాబాద్ పై వరాల వాన కురిపిస్తున్నారని అంటున్నారు. దీనిపై రాష్ట్రంలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని అంటున్నారు. తమ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని కోరుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. సంక్షేమ పథకాల పేరుతో ఒకే నియోజకవర్గంలో నిధులు గుమ్మరించడం ఓట్లు కొనడమే అవుతుందని అంటున్నారు. ప్రజాధనాన్ని ఇలా ఖర్చు చేసే హక్కు ప్రభుత్వాలకు లేదని అంటున్నారు.
కాగా.. ఇదే సమయంలో ఏపీలోని నంద్యాల ఉప ఎన్నికను కూడా గుర్తు చేస్తున్నారు. అక్కడ గెలిచేందుకు టీడీపీ సర్కారు ఎన్ని ప్రయత్నాలు చేసిందో అందరికీ తెలిసిందే. అధికారాన్ని ఉపయోగించి సర్వం కుమ్మరించి గెలిచిందనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ.. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలో దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు హుజూరాబాద్ తీరు చూస్తుంటే.. నంద్యాల ఉప ఎన్నికే గుర్తొస్తోందని అంటున్నారు. ఏదిఏమైనా.. రాష్ట్రంలో కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ.. ఒక ఉప ఎన్నిక కోసం ఇలా వ్యవహరించడం సరికాదని అంటున్నారు. దీనివల్ల కేసీఆర్ తమ పార్టీ బలహీనతను బయట పెట్టుకుంటున్నారని అంటున్నారు. మరి, గులాబీ నేతలు ఏమంటారో?