TRS MLAs Poaching Case: ఆధిపత్య పోరు.. విచారణ సంస్థలతో ప్రతీకార రాజకీయాలతో తెలంగాణ రగులుతోంది. ఒకవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులతో టీఆర్‌ఎస్ నేతలపై విరుచుకు పడుతోంది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్థానిక పోలీసులతో ఏర్పాటు చేసిన సిట్‌తో బీజేపీ అధిష్టానాన్ని కొట్టే ప్రయత్నం చేస్తోంది.

కీలక పరిణామాలు..
ఈ క్రమంలో మంగళవారం రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు కేంద్రం తెలంగాణ కార్మిక శాఖ మంత్రి, వ్యాపారవేత్త, విద్యాసంస్థల అధినేత మలారెడ్డితోపాటు, అతని కొడుకులు, కూతురు, అల్లుడితోపాటు సోదరుడి ఇళ్లపై దాడులు చేస్తోంది. వ్యాపార, విద్యాసంస్థల్లోల సోదాలు చేస్తోంది. ఈ క్రమంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం మొదలు పెట్టింది. ఎమ్మెల్యేల ఎర కేసులో సోమవారం విచారణకు హాజరు కాని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్.సంతోష్‌తోపాటు, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామికి సిట్ లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ చేసింది.
తగ్గేదేలే అంటున్న కేసీఆర్..
ఒకవైపు ఐటీ దాడులతో వివిధ వ్యాపారాలు చేస్తున్న టీఆర్‌ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు వణుకుతున్నారు. మల్లారెడ్డి ఇంటిపై ఏకకాలంలో 50కిపైగా ఐటీ బృందాలు విరుచుకుపడడంతో హైదరాబాద్‌లో ఉన్న టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హడావుడిగా సమావేశమయ్యారు. ప్రతీకార దాడులుగా ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. దాడులను ఖండిస్తున్నారు. బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోపల మాత్రం భయంతో వణుకిపోతున్నారు. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాత్రం కేసీఆర్‌పై పోరులో తగ్గేదేలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సిట్ ద్వారా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేయించారు. నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్.సంతోష్‌తోపాటు కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామికి లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ చేయించారు.
సుప్రీం కోర్టు ఉత్తర్వులతో సిట్ దూకుడు..
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై విచారణ జరుపుతున్న సిట్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. సింగిల్ జడ్జి పర్యవేక్షణ కూడా ఎత్తివేసింది. న్యాయస్థానం మద్దతు లభించడంతో కేసీఆర్ సిట్ ద్వారా కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారి విచారణకు హాజరు కాకపోతేనే లుకౌట్‌నోటీసులు జారీ చేయించారని తెలుస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే విచారణకు సహకరించలేదన్న ఆరోపణలతో అరెస్ట్ వరకూ వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ లక్ష్యం కూడా అదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరికొందరికి నోటీసులు
దర్యాప్తులో వెల్లడవుతున్న ఆధారాల ప్రకారం సిట్ అధికారులు మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం విచారణకు హాజరైన న్యాయవాది శ్రీనివాస్ విచారణలో కొంతమంది బీజేపీ నేతల పేర్లు వెల్లడించినట్లు కేసీఆర్ సిట్ ద్వారా మీడియాకు లీకేజీ ఇచ్చారు. ఈ క్రమంలో వారికి కూడా నోటీసులు ఇవ్వబోతున్నట్లు సంకేతం పంపించారు. విచారణ గోప్యంగా ఉంచాలని సుప్రీం ఆదేశించినా.. కేసీఆర్ మాత్రం లీకులు ఇస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే బీజేపీ ఆరు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు చేసినట్లు సిట్ గుర్తించిందని మరో లీక్ చేయించారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలతో నిందితులు చర్చించినట్లు విచారణలో గుర్తించామని, ఫోన్ రికార్డుల ద్వారా ఈ విషయం వెలుగు చూసిందని ప్రచారం చేయిస్తున్నారు. దీని ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో కూడా వీరిపై కేసులు నమోదు చేయించాలనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కేంద్రం కూడా వేగంగా స్పందిస్తోంది. మరి బీజేపీ సర్కార్ మళ్లీ ఎలా స్పందిస్తుందో.. ఏం చేయబోతుందో చూడాలి.