
రేపు (జూలై 24) టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బర్త్ డే. గులాబీ సాధారణ కార్యర్త నుంచి కేబినెట్ మంత్రుల దాకా అందరూ సిద్ధమైపోతారు. ఇవాళ్టి చిన్నబాసును.. రేపటి పెద్దబాసును ప్రసన్నం చేసుకోవడానికి కానుకలతో రెడీగా ఉంటారు. అయితే.. పుట్టిన రోజు పేరుతో పాలాభిషేకం చేయడం నుంచి ఫ్లెక్సీలు కట్టడం దాకా.. రకరకాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే.. ఈ పనులకు బదులుగా సేవా కార్యక్రమాలకు డబ్బులు వెచ్చించాలని పార్టీ నేతలకు సూచిస్తున్నారు కేటీఆర్.
గత పుట్టిన రోజు సందర్భంగా.. అంబులెన్సులు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు కేటీఆర్. తన వంతుగా 6 అంబులెన్సులకు విరాళం ఇస్తున్నానని, మీరు కూడా తోచినంత ఇవ్వాలని సూచించారు. దీంతో.. చాలా మంది బడా నేతలు అంబులెన్సులకు విరాళాలు ప్రకటించారు. వీటితో దాదాపు 90 నుంచి 100 వరకు అంబులెన్సులు వస్తాయనే ప్రచారం కూడా జరిగింది. మంత్రి మల్లారెడ్డి వంటివారు కొందరు అంబులెన్సులు ఇచ్చారు కూడా. అయితే.. చాలా మంది మాత్రం ప్రకటనలకే పరిమితం అయ్యారు.
ఇక, ఈ పుట్టిన రోజుకు మరో అంశంతో ముందుకు వచ్చారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ.. ఆ తర్వాత ఆలోచన మారింది. ఏకంగా ట్రై స్కూటర్లను పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు కేటీఆర్ తన వంతుగా వంద స్కూటర్లను ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇదే విషయాన్ని పార్టీ కార్యకర్తలకు తెలిపి.. మీరు కూడా ఇదేవిధంగా చేయాలని సూచించారు.
సౌండ్ పార్టీలుగా ఉన్న గులాబీ నేతలు.. మంత్రులు వెంటనే స్పందించారు. తాము కూడా ట్రై స్కూటర్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఈ సారి ప్రకటించిన వారిలో ఎంత మంది ఇస్తారన్నది చూడాలి. అయితే.. మొత్తానికి ఫ్లెక్సీలు, పూలదండలకన్నా.. ఈ విధంగా వికలాంగులకు, ఇతరులకు మేలు జరిగేలా తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ఆచరణీయమైనదే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.