Sajjala Ramakrishna- Jagan Family: ఏపీ సీఎం జగన్ కు సజ్జల రామకృష్ణా రెడ్డి వీర విధేయుడు. ఈనాడు జర్నలిస్టుగా ఉన్న సజ్జల ఆ సంస్థతో తెగతెంపులు చేసుకొని జగన్ పంచన చేరారు. ఈనాడుకు దీటుగా పేపర్, టీవీని ఏర్పాటుచేయాలని ఒత్తిడి చేశారు. నాడు సీఎంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి అంతగా ఆసక్తికనబరచకపోయినా జగన్ ను ఒప్పించి సాక్షి మీడియాను ఏర్పాటుచేయించారు. వైఎస్సార్ మరణం తరువాత లెక్కలు చూపించి మరీ జగన్ ను సీఎం చేయాలని చూశారు. కానీ లెక్క తప్పింది. దీంతో సొంత పార్టీని ఏర్పాటుచేయాలని పురమాయించారు. వైసీపీని ఏర్పాటుచేసిన తొలి ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. అయినా జగన్ వెన్నంటి ఉండి పార్టీని బలోపేతం చేశారు. చివరకు అధికారంలోకి వచ్చింది. జగన్ సొంత కుటుంబసభ్యులకు కాదని సజ్జల పార్టీలో నంబరు టూ స్థానానికి వచ్చారు. అటు పాలన, ఇటు పార్టీ వ్యవహారాల్లో కూడా సజ్జల పట్టు సాధించారు. పార్టీకి అత్యంత కీలకంగా భావించే సోషల్ మీడియా విభాగానికి తన కుమారుడ్ని సారధిగా చేశారు. అంటే ఏకంగా పార్టీని తన కబంధ హస్తాల్లోకి సజ్జల తీసుకున్నారని వైసీపీ వర్గాల్లో కూడా టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ కుటుంబాన్ని నిట్టనిలువునా చీల్చారన్న ఆరోపణలను మాత్రం ఎదుర్కొంటున్నారు. వాటిని నిజం చేసేలా పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి కుటుంబం తప్ప.. మిగతా వైఎస్ కుటుంబం జగన్ కు దూరమైంది. అయితే వీరంతా దూరం కావడానికి సజ్జల కారణమంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా టీఆర్ఎస్ నాయకులు సజ్జలపై ఇవే ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల పలు సందర్భాల్లో తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీనిపై సజ్జల కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో హరీష్ రావుకు విభేదాలున్నాయని.. అందుకే ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారని సజ్జల ఆరోపించారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ నాయకులు సజ్జలపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్సార్ కుటుంబంలోకి సజ్జల ఉడుముల దూరారని.. జగన్ నుంచి తల్లిని, చెల్లిని దూరం చేశారని కామెంట్స్ చేశారు. అటువంటి వ్యక్తి కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు. అయితే వైసీపీలో కూడా సజ్జలపై ఇవే రకం అనుమానాలున్నాయి. కానీ ఎవరూ బయటపడడం లేదు. వైసీపీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. రాజశేఖర్ రెడ్డితో సమకాలికులున్నారు. అయితే వారంతా సజ్జల హవాను సహించలేకపోతున్నారు. పార్టీలో నంబర్ టూ స్థానంలో ఉన్న సజ్జల చర్యలు వారికి మింగుడు పడడం లేదు. అటు పార్టీని, పాలనను సజ్జలకు అప్పగించడమేమిటని సీఎం జగన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరకు తాము ఎంతో అభిమానించే రాజశేఖర్ రెడ్డి భార్యను, కుమార్తెను పార్టీ నుంచి సాగనంపిన తీరుపై ఆక్షేపిస్తున్నారు. కానీ ఎవరూ బయటపడలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుల తాజా ఆరోపణలు వైసీపీలో కొత్త చర్చకు దారితీశాయి.

ప్రభుత్వ పాలనను సజ్జలే నడిపిస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో ఆయనే చర్చిస్తారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నియమించే హైపవర్ కమిటీలో ఆయనే ఉంటారు. ప్రభుత్వ విధానాలను చెప్పే అధికార ప్రతినిధిగా ఆయనే వ్యవహరిస్తారు.అటు ప్రభుత్వంపై వచ్చే ఆరోపణలకు, వైఫల్యాలకు ఆయనే వివరణ ఇస్తారు. దీంతో ఇంటా బయటా సజ్జల హవాపై సీనియర్లు కీనుక వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే అటు పార్టీ, ఇటు ప్రభుత్వం ఆయన గుప్పెట్లోనే ఉంది. ఇవే అనుమానాలను టీఆర్ఎస్ నాయకులు బయటపెట్టారు. అయితే హరీష్ రావును నియంత్రించాలని ఉద్దేశ్యంతోనే తాను విమర్శలు చేస్తే.. ఇప్పుడు తనను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ మంత్రులు ఎదురు దాడికి దిగుతుండడంపై సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ పరిణామాలు మున్ముందు వైసీపీలో చిచ్చురేపే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.
Also Read:EMI BURDEN: EMI చెల్లించేవారికి షాకింగ్ న్యూస్.. ఇకపై ఎంత భారం పడనుందంటే.?