https://oktelugu.com/

డీసీసీబీ చైర్మన్ ఎన్నికల్లో మంత్రులకు షాక్

తెలంగాణలో ఏకగ్రీవంగా జరిగిన డీసీసీబీ చైర్మన్ ఎన్నికల్లో మంత్రులకు, సీనియర్ నేతలకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు షాక్ ఇచ్చారు. పార్టీలో బలమైన నాయకత్వం ఏర్పడకుండా, తన కొడుకు కేటీఆర్ ఆధిపత్యం కొనసాగేందుకు ఈ సందర్భంగా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తున్నది. అందుకనే పలు జిల్లాల్లో బలమైన నాయకులు, మంత్రులు సూచించిన వారికి కాకుండా అనూహ్యమైన పేర్లను తెరపైకి తెచ్చారు. చైర్మన్ ఎన్నికపై పార్టీ పెద్దలు ముందుగా ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. వారి అభిప్రాయం మేరకు ఎంపిక జరుగుతుందని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 1, 2020 / 01:59 PM IST
    Follow us on

    తెలంగాణలో ఏకగ్రీవంగా జరిగిన డీసీసీబీ చైర్మన్ ఎన్నికల్లో మంత్రులకు, సీనియర్ నేతలకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు షాక్ ఇచ్చారు. పార్టీలో బలమైన నాయకత్వం ఏర్పడకుండా, తన కొడుకు కేటీఆర్ ఆధిపత్యం కొనసాగేందుకు ఈ సందర్భంగా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తున్నది. అందుకనే పలు జిల్లాల్లో బలమైన నాయకులు, మంత్రులు సూచించిన వారికి కాకుండా అనూహ్యమైన పేర్లను తెరపైకి తెచ్చారు.

    చైర్మన్ ఎన్నికపై పార్టీ పెద్దలు ముందుగా ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. వారి అభిప్రాయం మేరకు ఎంపిక జరుగుతుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. అభ్యర్థుల పేర్లను సీల్డ్ కవర్‌లో పెట్టి అబ్జర్వర్ల చేతికిచ్చారు.

    రాత్రికి రాత్రే జిల్లాలకు వెళ్లిన అబ్జర్వర్లు.. మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో సీల్ట్ కవర్స్‌ తెరవగానే, వాటిల్లో ఉన్న పేర్లు చూసి కొందరు మంత్రులు కంగుతిన్నారు. తమ ఆధిపత్యానికి కావాలని చెక్ పెడుతున్నారని వారు గ్రహించారు.

    నల్గొండ జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతలైన మంత్రి జగదీశ్ రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లకు షాక్ ఇచ్చారు. ఇప్పటికే అసెంబ్లీ విప్ గా ఉన్న ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత భర్త మహేందర్ రెడ్డికి డీసీసీబీ చైర్మన్ పదవి దక్కింది .

    రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవిని తమ బంధువైన కిష్టారెడ్డికి ఇప్పించుకునేందుకు మంత్రి సబితారెడ్డి చివరి నిమిషం వరకు లాబీయింగ్ చేశారు. కాని కేటీఆర్ అనుచరుడైన మనోహర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.

    మహబూబ్‌నగర్ జిల్లాలో డీసీసీబీ చైర్మన్ పదవిని తన అనుచరుడు ఎం.విష్ణువర్థన్ రెడ్డికి కట్టబెట్టేందుకు మంత్రి నిరంజన్ ప్రయత్నించారు. కానీ మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించిన మైనారిటీ నేత నిజాం పాషాను ఈ పదవి వరించింది.

    నిజామాబాద్ లో సహితం మంత్రి సంతోష్ రెడ్డి అభ్యర్థిని కాదని డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కొడుకు భాస్కర్ రెడ్డికి ఇచ్చారు.

    మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా తన భర్తకు అవకాశం ఇవ్వాలని మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కేబినెట్‌లోకి తీసుకోలేదని దానికి ప్రతిగా తన భర్తకు చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే తాజా మాజీ డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న చిట్టి దేవేందర్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చారు.

    వరంగల్ డీసీసీబీ చైర్మన్‌గా మార్నేని రవీందర్ రావు ఎంపికను మంత్రి ఎర్రబెల్లి అయిష్టంగానే ఒప్పుకున్నట్టు పార్టీ నేతలు చెపుతున్నారు.

    ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పదవిని తన అనుచరుడైన తుళ్లూరు బ్రహ్మయ్యకు ఇప్పించేందుకు ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రయత్నించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడిగా ఉన్న మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. వీరిద్దరిని కాదని, మరి మంత్రి అజయ్ బలపరచిన బీసీ కులానికి చెందిన కూరాకుల నాగభూమయ్య ను ఎంపిక చేశారు.