TRS To BRS : అప్పుడెప్పుడో దసరాకు యాటకూర తిని ప్రకటించిన ‘బీఆర్ఎస్’ ఇప్పటికీ సాకారమైంది. టీఆర్ఎస్ ఇక చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. కేంద్రంలోని బీజేపీతో కొట్లాడుతున్న కేసీఆర్ కు ఆదినుంచి ఇది అవుతుందా? ఈసీతో బీజేపీ ఏమైనా మోకాలడ్డుతుందా? అన్నది చాలా డౌట్లు ఉండేవి. కానీ బీఆర్ఎస్ గా టీఆర్ఎస్ మారిపోయిందని ఈసీ కబురు పంపడంతో బర్రె ఈనినింత పని అయింది. తెలంగాణలో అత్యంత ఆనందకర విషయాన్ని చెప్పడానికి ‘బర్రె ఈనినంత పండుగ’ అని అంటుంటారు. ఇప్పుడు కేసీఆర్ బ్యాచ్ కు ఇదే సందర్భం వచ్చింది. అందుకే ఈ సంబరాన్ని అంబరంగా జరిపేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. బీఆర్ఎస్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు రేపే ముహూర్తం పెట్టాడు.

అక్టోబర్ 5న దసరా రోజున పార్టీ సమావేశం పెట్టి.. దేశంలోని సానుభూతిపరులైన నేతలను తోలుకొచ్చి మరీ కేసీఆర్ ‘బీఆర్ఎస్’ గా తన పార్టీని మార్చేసి ఈసీకి పంపారు. పార్టీ పేరు మారితే గుజరాత్ లోనూ పోటీచేస్తానన్నారు. కానీ కవితపై ఢిల్లీ లిక్కర్ స్కాం, మునుగోడు ఎన్నికలు, ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు దారులు దొరకడం.. బీజేపీతో ఫైట్ నేపథ్యంలో ‘బీఆర్ఎస్’ స్కీంను ముందుకు పోనియ్యలేదు. అప్పటి నుంచి ఈసీ నిబంధనలకు అనుగుణంగా ప్రాసెస్ ను చేస్తూ వచ్చారు.
కొందరి అభ్యంతరాలు.. ఈసీ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇస్తూ ఎట్టకేలకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. కేసీఆర్ పంపిన ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేసీఆర్ కు లేఖ పంపింది. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో రేపు బీఆర్ఎస్ ఆవిర్బావ వేడుకలను జరిపేందుకు కేసీఆర్ రెడీ అయిపోయారు.
రేపు మధ్యాహ్నం 1.20 గంటలకు దీన్ని కూడా ముహూర్తం చూసి జాతక ప్రకారం పార్టీ ఆవిర్భావ ప్రకటన వేడుకలను కేసీఆర్ నిర్ణయించారు. దేశ రాజకీయాల్లో దున్నేయాలని బయలుదేరిన కేసీఆర్ ఆశలకు ఈసీ ఎట్టకేలకు ఊపిరిలూదింది. మరి బీఆర్ఎస్ తో దేశంలో కేసీఆర్ ఎలాంటి ప్రభావం చూపిస్తాడు? ఎంతలా ముందుకెళతాడన్నది వేచిచూడాలి. మొత్తానికి అసలు బీఆర్ఎస్ గా టీఆర్ఎస్ మారుతుందో లేదోనన్న భయాల నడుమ ఈ ప్రకటన రావడం నిజంగానే కేసీఆర్ అండ్ కోకు మాత్రం భారీ ఊరటనిచ్చిందనే చెప్పాలి.