Huzurabad: హుజూరాబాద్ ఎన్నికలు ముగిసి మూడు రోజులు అవుతోంది. ఈరోజు కౌంటిగ్ జరగబోతోంది. దాని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. తరువాత ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కించనున్నారు. 22 రౌండ్ల పాటు కొనసాగే ఈ లెక్కింపులో మొదటగా కమలాపూర్ చివరగా హుజూరాబాద్ మండలంలో ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో ఈవీఎంలో 9 నుంచి 11 వేల ఓట్లు ఉండే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం తరువాత ఎన్నికల ఫలితాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే రెండు పార్టీలు ఇప్పటికీ తమదే గెలుపు అనే ధీమాతో ఉన్నాయి. తామే హుజూరాబాద్ పై జెండా ఎగరవేయబోతున్నామని చెప్పుకుంటున్నారు.

ఎందుకంత కాన్ఫిడెంట్.. ?
రెండు పార్టీలు గెలుపుపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ఎవరికి ఉండే పాజిటివ్ అంశాలు వారికున్నాయి. అవే తమకు విజయాన్ని అందిస్తాయని నమ్ముతున్నారు. హుజూరాబాద్‌లో మూడు పార్టీలు బరిలో ఉన్నా.. తుది హోరు మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్యే గెలుపోటములు ఉండే అవకాశం ఉంది. గత 5 నెలలుగా విస్తృతంగా హుజూరాబాద్ ప్రజల మధ్య ఉన్న రెండు పార్టీల నాయకులు గెలుపు తమదే అని గట్టిగా చెబుతున్నారు.
టీఆర్ఎస్ బలమేంటి ?
మొదటి నుంచి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెబుతున్నారు టీఆర్ఎస్ శ్రేణులు. అసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ వంటి సంక్షేమ పథకాలతో పాటు దళిత బంధు పథకం తమకు కలిసిరానుందని చెబుతున్నారు. ఒక్క దళితబంధు పథకం వల్లే తమకు 60-70 వేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.. యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వారి ఓట్లు కూడా తమకు కలిసి వస్తాయని అనుకుంటున్నారు. అలాగే విద్యార్థుల నుంచి కూడా కొన్ని ఓట్లు వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
ముఖ్య నాయకుల మౌనమెందుకు ?
గెలుపుపై టీఆర్ఎస్ ధీమాగా ఉన్నా.. ఆ పార్టీ ముఖ్య నాయకులు మౌనంగానే ఉంటున్నారు. ఎన్నికల ముందు వరకు విజయం తమదే అని చెప్పుకున్నవారందరూ ఎన్నికల తరువాత ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. దీనికి కారణం టీఆర్ఎస్ అధిష్టానం నుంచి వచ్చిన అంతర్గత ఉత్తర్వులే కారణం అని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు వారిని సైలెంట్ గానే ఉండాలని అదేశాలు వచ్చాయని సమాచారం.
Also Read: Huzurabad By Poll: హుజూరాబాద్ విజేత ఎవరు? ఉత్కంఠ.. తేలేది నేడే.. కౌంటింగ్ ప్రారంభం
బీజేపీకి కలిసి వచ్చేవేంటి ?
హుజూరాబాద్ విజయంపై కమలనాథులు కూడా గట్టి నమ్మకంతోనే ఉన్నారు. 17 ఏళ్లుగా స్థానిక నేతగా ఉన్న ఈటల రాజేందరే తమ ప్రధాన బలమని బీజేపీ చెబుతోంది. ఆయనకు స్థానికుల్లో ఉన్న అభిమానమే తమ పార్టీకి విజయం చేకూరుస్తుందని తెలుపుతున్నారు. బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారని, ప్రజల్లో టీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకత తమకు కలిసిరానుందని చెబుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు, రైతుల్లో ఉన్న అసంతృప్తి తమకు ఓట్లుగా మారాయని తెలుపుతున్నారు. మరి హుజూరాబాద్ ప్రజలు ఏమనుకున్నారో, ఆయా పార్టీల అంచనాలు ఎంత వరకు నిజం అవుతాయనే విషయం మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.
Also Read: CM KCR: ప్రకటించి రెండేళ్లాయే.. ఉద్యోగాలేవి కేసీఆర్ సారూ?