TRS vs BJP: తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య అన్ స్టాపబుల్‌గా సాగుతున్న ఆధిపత్య, ప్రతీకార పోరు క్రమంగా పతాక స్థాయికి చేరుతోంది. కేంద్రంపై పోరులో తగ్గేదేలే అంటున్న సీఎం కె.చంద్రశేకర్‌రావు.. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లుగా అస్త్ర శస్త్రాలన్నీ వెలికి తీస్తున్నారు. ఇదే సమయంలో 2023 ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్నన భారతీయ జనతాపార్టీ టీఆర్‌ఎస్ ఆర్థిక మూలాలపై దృష్టి పెట్టింది. ఎక్కడెక్కడ ఏయే రూపంలో ఎవరెవరి ద్వారా ఆర్థిక బలం అందుతుందో వాటిని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే ఈడీ, ఐటీ దాడులు చేయిస్తోందన్న వాదనలు బలంగా రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ ఆధిపత్య పోరులో ఇప్పటికే మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి దుమ్ము దులిపిన ఐటీ, ఈడీ తర్వాత ఎవరిని టార్గెట్ చేస్తాయో అని గులాబీ నేతల్లో గుబులు మొదలైంది. మరోవైపు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో సిట్ ద్వారా తన స్క్రిప్ట్ అమలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటికే బీజేపీ నంబర్ 3 అయిన బీఎల్.సంతోష్‌ను టార్గెట్ చేశారు. ఎలాగైనా ఆయనను సిట్ విచారణకు రప్పించి ఆయన ద్వారా నంబర్ 1, 2ను కొట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఇంకా ఎంతమందిని టార్గెట్ చేస్తారో అని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

ముందు ముందు చాలా ఉండబోతుందా?
తెలంగాణలో పరిస్ధితులు చూస్తుంటే అప్పుడే ఏముంది ఇంకా ముందు ముందు చాలా ఉండబోతోంది అంటోంది బీజేపీ. ఇదంతా కుట్రలో భాగమేనంటోంది అధికార టీఆర్‌ఎస్ పార్టీ. అంతేకాదు చర్యకి ప్రతిచర్య ఉంటుందని కూడా కాషాయం పార్టీని హెచ్చరిస్తూనే ఏదో ప్లాన్ వేయబోతోందని చెప్పకనే చెప్పారు. కేసీఆర్ కొత్త వ్యూహం ఎలా ఉండబోతోంది? బీజేపీ లిస్ట్‌లో ఇంకెంతమంది ఉన్నారు ? నెక్ట్స్ టార్గెట్ ఎవరు ? ఇప్పుడిదే రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Pawan Kalyan: ప్రజల కోసం కోట్ల వితరణ.. పవన్ కళ్యాణ్ సాయానికి సెల్యూట్ చేయాల్సిందే
సీబీఐ రాకుండా అడ్డుకుంటే..
ఒక్క సీబీఐని రాకుండా అడ్డుకుంటే ఇంకేమీ దారులు లేవా అన్నట్లు తెలంగాణ రాష్ట్రంలో వరస పెట్టి దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికారపార్టీనే టార్గెట్ చేస్తూ కేంద్ర సంస్థలు ఈడీ, ఐటీ రంగంలోకి దిగాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీని దెబ్బతీసే పనిలో భాగంగా బలమైన పునాదులను కదిల్చేందుకు ప్రయత్నిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో టీఆర్‌ఎస్ అత్యంత ధనిక పార్టీల్లో ఒకటని అందరికీ తెలిసిన విషయమే. ఈ పార్టీకి ఆర్థికంగా బలాన్నిచ్చే ఆయుధాలను వెతికి మరీ నాశనం చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా ఒకరి తర్వాత మరొకరిపై ఈడీ, ఐటీ దాడులను జరుపుతోందన్నది ఇన్ సైడ్ టాక్.
సంపన్నుల జాబితా రెడీ..
టీఆర్‌ఎస్ నేతల్లో చాలామంది ఆర్థికంగా బలవంతులు ఉన్నారు. అందులో మల్లారెడ్డి ఒకరు. ఆయనపై సొంతపార్టీనే కాదు విపక్షాలతోపాటు స్థానికులు, ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. నిన్నగాక మొన్న ఆయన విద్యాసంస్థలు కనిపించడం లేదన్న కారణంతో రోడ్డువైపున ఉన్న చెట్లన్నింటిని నరికించేశారు. ఇది చిన్న విషయమే కానీ చాలా పెద్ద ఆరోపణలే మల్లారెడ్డిపై ఉన్నప్పటికీ కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొన్న మునుగోడు ఉపఎన్నికల టైంలోనూ మందు, విందుతోటి వార్తల్లో నిలిచారు. ఆయన విద్యాసంస్థలపైనా పలు ఆరోపణలు ఉన్నాయి. దాన్నే అవకాశంగా తీసుకొని బీజేపీ మల్లారెడ్డిపై ఐటీ దాడులు చేసిందన్న టాక్స్ బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు వ్యాపారాలు ఉండటం కొత్తకాదు కానీ తరగని సంపదనిచ్చే మైనింగ్, లిక్కర్, రియల్ ఎస్టేట్ వంటి ప్రధాన వనరులన్నీ టీఆర్‌ఎస్ నేతల దగ్గరే ఉన్నాయని అందుకే గులాబీ నేతలంతా బంగారుమయం అవుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో మొన్న మంత్రి గంగుల, నిన్న మంత్రి తలసాని సోదరులు ఇవాళ మంత్రి మల్లారెడ్డి రేపు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. వరసగా దాడులు జరుగుతుండటంతో నెక్ట్స్ ఎవరన్న భయం ఆపార్టీ నేతలను కలవరపెడుతోంది.
సర్దుకున్న కేటీఆర్..
ఈడీ, ఐటీఈ దాడుల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమైన మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ కూడా అప్రమత్తమైనటు తెలుస్తోంది. మల్లారెడ్డిపై ఐటీ దాడులు జరుగుతున్న మూడు రోజులు కేటీఆర్ రాష్ట్రంలో లేకుండా పోయార్న ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఐటీ తననే టచ్ చేస్తుందన్న భయంలో కేటీఆర్ తన ఆస్తుల చిట్టా, బ్లాక్ మనీ ఐటీకి చిక్కకుండా తరలించినట్లు తెలుస్తోంది. బేగంపేట నుంచి ప్రత్యేక చార్టడ్ ఫ్లైట్‌లో భారీగా నగదు, కీలక పత్రాలు దుబాయ్‌కి తీసుకెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటీఆర్‌పై కూడా అక్రమాస్తుల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఐటీ తర్వాత టార్గెట్ కేటీఆరే అన్న సంకేతాలు వెలువడ్డాయి. దీంతోనే కీలక డాక్యుమెంట్లను కేటీఆర్ మాయం చేశాడని తెలుస్తోంది.

ప్రతీకార దాడులపై కేసీఆర్ దృష్టి..
ఇప్పటికే ఈడీ, ఐటీ దాడులతో బెంబేలెత్తుతున్న కారు పార్టీ నేతలు, గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పుడు ప్రతీకార చర్యగా ఆలోచనలు చేస్తున్నట్లు ఆపార్టీ నేతల మాటల్లోనే తెలిసిపోతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలుతో ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారానికి బదులిచ్చిన కేసీఆర్ రేపు తన పరిధిలో ఉన్న దర్యాప్తు సంస్థలతో దాడులతో బీజేపీ నేతలకు షాక్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో కీలకంగా ఉన్న బీఎల్ సంతోష్ కు 41ఏ నోటీసులు ఇవ్వటం సాధారణమైన విషయం కాదు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారనే అభయోగాలతో విచారణ ఎదుర్కొంటున్న నిందితులు బీఎల్.సంతోష్ పేరు ప్రస్తావించారు. ఈ కేసులో ఏ4 నిందితుడిగా చేర్చారు.
సంతోష్ తరువాత ఎవరు..?
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నంబర్ 1, నంబర్ 2 కూడా సంతోష్ ఇంటికి వచ్చి చర్చలు చేస్తారంటూ చెప్పిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ కేసును విచారిస్తున్న సిట్ సంతోష్‌ను విచారణకు రప్పించి మరికొంతమంది జాతీయ నాయకులతోపాటు నంబర్ 1, నంబర్ 2ను టార్గెట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
జాతీయ స్థాయిలో చర్చ..
బీఎల్ .సంతోష్‌కు నోటీసులు ఇవ్వటం ద్వారా ఈ కేసులో ఏ స్థాయికి అయినా వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు స్పష్టం అవుతోంది. మరోవైపు ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో కేసీఆర్ తర్వాత టార్గెట్ ఎవర్చ చర్చ బీజేపీలో జరుగుతోంది. సిట్ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఉత్కంఠ పెంచుతోంది. సంతోష్ తరువాత ఇంకా లిస్టులో ఎవరున్నారు.. ఇంకా నోటీసులు ఎవరికైనా జారీ అవుతాయా అనేది ఆసక్తి కర చర్చగా మారుతోంది.
Also Read:TS Group 4 Jobs: తెలంగాణలో మరో జాతర.. గ్రూప్4 ఉద్యోగాలు ఏశాఖలోఎన్ని?