దిగిపోతూ కూడా ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తన ప్రత్యర్థులను వదలడం లేదేనని ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఏపీ సీఎం జగన్, మంత్రులు.. నిమ్మగడ్డతో గతంలో ఢీ అంటే ఢీ అన్నారు. పంచాయతీ ఎన్నికల సాక్షిగా వీరి వైరం ముదిరి పాకాన పడింది. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ చేతులమీదుగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను ముగించారు. క్లీన్ స్వీప్ కావడంతో వైసీపీ ఆనంద పడింది.
అయితే నిమ్మగడ్డ గవర్నర్ కు సీక్రెట్ గా రాసిన లేఖలు బయటపడడం కలకలం రేపింది. అసలే ఏం జరిగినా ఊరుకోని నిమ్మగడ్డ రమేశ్ మరోసారి హైకోర్టు గడ ప తొక్కాడు. ఈ మేరకు తన లేఖల లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని నిమ్మగడ్డ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.
నిమ్మగడ్డ వాదనలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గవర్నర్ కు తాను రాసిన లేఖ గురించి తన కార్యాలయంలో కూడా ఎవరికి తెలియదని..తనకు మాత్రమే తెలుసు అని.. కాబట్టి ఈ లీక్ జరిగింది గవర్నర్ కార్యాలయం వైపు నుంచే ఉందని సంచలన విషయాలను నిమ్మగడ్డ పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే తనవైపు నుంచి లీక్ కాలేదని ఏపీ ఎస్ఈసీ సెక్రటరీ హైకోర్టుకు చెప్పడంతో ఇప్పుడీ వ్యవహారం బొత్స, పెద్దిరెడ్డి మెడకు చుట్టుకున్నట్టు అనిపిస్తోంది.
ఈరోజు విచారించిన హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎస్, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలను ప్రతివాదులుగా చేర్చారు. ఇందులో భాగంగా జరిగిన విచారణలోనే ఇద్దరు మంత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వచ్చే మంగళవారంకు వాయిదా వేసింది.
ప్రశాంతంగా రిటైర్ కావాల్సిన నిమ్మగడ్డను మళ్లీ ఆయన రాసిన లేఖలు లీక్ చేసి అనవసరంగా కెలికినట్టు అయ్యిందని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సైలెంట్ గా ఆయన మానాన నిమ్మగడ్డను వదిలేస్తే మార్చి 31 తో రిటైర్ అయిపోయేవాడు.. ఏపీ సీఎం జగన్, మంత్రులకు ఆయన నుంచి ఉపశమనం దక్కేది. ఇప్పుడు మరో పిటీషన్ తో హైకోర్టుకు ఎక్కడం.. హైకోర్టు మంత్రులకు నోటీసులు జారీ చేయడంతో ఏపీ మంత్రులు చిక్కుల్లో పడ్డట్టు అయ్యింది.