Arunachalam Manickavel: సంస్కారవంతమైన సోప్ అనే పేరుతో తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకున్నాడు. ఎక్కడ తమిళనాడు నుంచి వచ్చి గుంటూరులో స్థిరపడి… XXX పేరుతో సబ్బుల కంపెనీ ఏర్పాటుచేసి.. వేలాది మందికి ఉపాధి కల్పించాడు. అటువంటి వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం కన్నుమూశాడు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాణిక్కవేల్ అరుణాచలం చిన్నప్పుడే గుంటూరు వచ్చాడు. తన కుటుంబ సభ్యులు బతుకుదెరువు నిమిత్తం గుంటూరు వచ్చారు. మాణిక్కవేల్ తన విద్యాభ్యాసాన్ని గుంటూరులోనే పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి అతడికి వ్యాపారిగా స్థిరపడాలనే కోరిక బలంగా ఉండేది. అందువల్లే చదువు పూర్తి అయిన తర్వాత వ్యాపారం వైపు వచ్చాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేసిన తర్వాత.. సబ్బుల కంపెనీ ఎందుకు పెట్టకూడదని అనుకున్నాడు. ఆయన మదిలో మిగిలిన ఆలోచన కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పట్టింది. అయినప్పటికీ అప్పటికి మార్కెట్లో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ ఆధిపత్యం నడుస్తోంది. రిన్, టైడ్, హెన్ కో, ఏరియల్, వీల్, నిర్మా వంటి ఉత్పత్తులు మార్కెట్లో పెత్తనాన్ని చలాయిస్తున్నాయి. ఈ క్రమంలో ధైర్యం చేసి మాణిక్కవేల్ XXX బ్రాండ్ ను తెరపైకి తీసుకొచ్చాడు. మొదట్లో అంతగా విక్రయాలు ఉండేవి కావు. ఆ తర్వాత దానికి సంస్కారవంతమైన సోప్ అనే ట్యాగ్ లైన్ తగిలించడంతో ఒకసారిగా మార్కెట్ పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత విలువైన బ్రాండ్ గా XXX ఎదిగింది.
ఇక్కడి నుంచే వ్యాపారం
గుంటూరులో అరండల్ పేటలో మాణిక్క వేల్ నివాసం ఉంటున్నాడు. తన పూర్వీకుల ది అరుణాచలం అయినప్పటికీ.. గుంటూరులోనే మాణిక్క వేల్ స్థిరపడ్డాడు. సబ్బుల వ్యాపారాన్ని అంతకంతక విస్తరించాడు. XXX బ్రాండ్ ను తెలుగువారు ఓన్ చేసుకునేలా అనేక ప్రణాళికలు రూపొందించాడు. మార్కెటింగ్ ను బలోపేతం చేశాడు. తద్వారా వందల కోట్ల వ్యాపారాన్ని సృష్టించాడు. అయితే కొంతకాలంగా మాణిక్క వేల్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్, చెన్నై, ముంబైలోని అతిపెద్ద కార్పొరేట్ ఆసుపత్రులలో చూపించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ క్రమంలో గురువారం అరండల్ పేటలోని తన స్వగృహంలో మాణిక్క వేల్ కన్నుమూశారు. ఎక్కడో తమిళనాడులోని అరుణాచలం నుంచి చిన్నప్పుడే గుంటూరు వచ్చి.. ఇక్కడ చదువుకొని.. చిన్న చిన్న వ్యాపారాలు చేసి.. సబ్బుల తయారీలో అగ్రగామి సంస్థను ఏర్పాటు చేయడం అంటే మాటలు కాదు. ఇవన్నీ కూడా చేతల్లో చూపించి.. వేలాది మందికి ఉపాధి కల్పించి.. వారికి ఆర్థికంగా చేయూతనందించి.. ప్రబల శక్తిగా ఎదిగాడు మాణిక్కవేల్. ఆయన మృతితో XXX సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు పెద్ద దిక్కుగా ఉన్న మాణిక్క వేల్ చనిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.. మాణిక్కవేల్ అనారోగ్యంగా ఉన్నప్పుడే.. తన గ్రూపు సంస్థల వ్యాపారాలను విభజించారని.. ఆయన తదనంతరం వారసులు వాటిని నిర్వహిస్తారని తెలుస్తోంది. మాణిక్క వేల్ అనారోగ్యానికి గురైనప్పుడే వారసులకు వ్యాపార బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే వారు గ్రూపు సంస్థల్ల కార్యకలాపాలు చూసుకోవడం మొదలుపెట్టారు.. మాణిక్క వేల్ మరణం తీరనిలోటని త్రిబుల్ ఎక్స్ కంపెనీ సంతాప ప్రకటనలో పేర్కొంది.