Girijana Bandhu: వారి హామీలకు హద్దులేదు.. సాధ్యాసాధ్యాలు, ఆర్థిక వనరులను పట్టించుకోకుండా బంధుల పేరిట కొత్త పథకాలు తెచ్చి ఎన్నికల చెదరగంలో అమాయక ప్రజలను పావులుగా కదుపుతూ వేడుక చేసుకుంటున్నారు. దళిత బంధులో అనేక అవతవకలు ఉన్నాయంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని సీఎం వారం క్రితం సమైక్యతా సభ సాక్షిగా గిరిజన బంధు తెచ్చారు. జీవోను కూడా విడుదల చేశారు. ఇది కాస్తా కోర్టుకెక్కడంతో పథకానికి సంబంధించి అర్హుల ఎంపిక నెల రోజులకు వాయిదా పడింది.

అమలు ఎలా..
భూమి లేని నిరుపేద గిరిజనులు, ఆదివాసీలకే ఈ పథకం వర్తిస్తుందని సీఎం చెప్పారు. దీని కోసం జిల్లాల వారీగా ఇన్ చార్జిలను నియమించి ఏ మేరకు అర్హులు ఉన్నారో తేల్చాలని ప్రభుత్వం కమిటీలను వేసింది. రాష్ర్టంలో పోడు భూముల పంచాయతీ అటవీ, రెవెన్యూ డిపార్ట్ మెంట్ల మధ్య వివాదం నలుగుతూనే ఉంది. ఇటీవల ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రకారం భూమి లేవని వారికేనని చెప్పడంతో ఆ వర్గాల ప్రజలు సీఎంపై మండిపడుతున్నారు. అటవీ క్షేత్రంలో నివసించే తమకు కనీస సాగు కోసం ఎకరమైనా ఉంటుంది. అలాంటి వారికి కూడా వర్తించకుంటే ఎందుకు తెచ్చారు అంటూ నిలదీయడం కొసమెరుపు.
కోర్టు ఆదేశాలతో బ్రేక్
ఎన్నికల స్టంట్ గా వచ్చిన గిరిజన బంధు జీవోపై హైకోర్టు స్టే విధించింది. ఆఘ మేఘాల మీద తెచ్చిన జీవో రాజ్యాంగ పరిధికి లోబడి లేదని తేల్చింది. తదుపరి విచారణను నెల తర్వాత (అక్టోబర్ 21కి) వాయిదా వేసింది. అప్పటి వరకు దీనిపై ఎలంటి సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశించింది. దీంతో ఇన్ చార్జి కమిటీలు చేసేదేంలేక సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి.
మునుగోడు ముందా.. గిరిజన బంధు ముందా..
పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఏదో ఒకటి చేసి ఎన్నికల్లో గెలవానే పధకాలు రూపొందించడంలో కేసీఆర్ దిట్టని చెప్పవచ్చు. 2018లో ఎన్నికల సమయంలో రైతు బంధు తెచ్చిన కేసీఆర్, హుజూరాబాద్ బైపోల్ తో దళిత బంధు తెచ్చారు. ప్రస్తుతం రాష్ర్టంలో టీఆర్ఎస్ రోజు రోజుకూ బలహీన పడుతున్న తరుణంలో గిరిజన బంధు పేరిట మరో పథకం తెస్తే మునుగోడు బైపోల్ నెట్టుకురావచ్చని చూస్తున్నాడు. ఇందులో ఎస్టీలను పావులుగా వాడుకొని గిరిజన బంధు అనే పథకాన్ని అనౌన్స్ చేశారు. అది కాస్తా కోర్టు కెక్కింది. వచ్చే నెల 21వరకు ఈ ప్రక్రియను హోల్డ్ లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఈ లోపు ఎన్నికలు వస్తాయని అప్పుడు కోడ్ అమల్లోకి వచ్చి ప్రయోజనం శూన్యం అవుతుందని చర్చలు సాగుతున్నాయి. గిరిజనులపై అంత ప్రేమున్న కేసీఆర్ రాష్ర్టపతి ద్రౌపతి ముర్ముకు ఎందుకు మద్దతివ్వలేదని ప్రతిపక్షం గిరిజనులు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఎన్నికల స్టంట్ గానే చూడవలసి వస్తుందని చెప్తున్నారు.

ఎంపికపై దుమారం
రాష్ర్టంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో తెచ్చిన దళిత బంధు పథకం ప్రతి కుటుంబానికి అందజేస్తామని, ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులకు సైతం రూ. 10 లక్షలు అందజేస్తామని చెప్పిన కేసీఆర్ గిరిజన బంధు విషయం వచ్చే సరికి ఆంక్షలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఎకరం భూమి ఉన్నా గిరిజన బంధు వర్తించదని చెప్పడం తమపై కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ధిని చెప్పకనే చెప్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులు ఎక్కువగా పోడు సాగు చేస్తారు. వారికి ఎక్కడో ఒక చోట అరెకరం భూమైనా ఉంటుంది. వారికి కూడా పథకం వర్తించదని చెప్పడం ఏ మేరకు సమంజసం. అలాంటప్పుడు గిరిజన బంధు ఎందుకు అంటూ బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.