AP Three Capitals Issue: రాజధానుల’పై సుప్రీం కోర్టులో జగన్ కు షాక్

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించారు. అమరావతిని శాసన రాజధానికి పరిమితం చేశారు. అటు కర్నూలను న్యాయ రాజధానిగా చేస్తూ హైకోర్టు ఏర్పాటుచేస్తామని చెప్పుకొచ్చారు. దీనిపై అమరావతి రైతులు ఉద్యమ బాట పట్టారు.

Written By: Dharma, Updated On : July 11, 2023 6:31 pm

AP Three Capitals Issue

Follow us on

AP Three Capitals Issue: సుప్రీం కోర్టులో జగన్ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానుల ముచ్చట ఇప్పట్లో తేలే చాన్స్ లేదని తెలుస్తోంది. మరో పది నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. జనవరి నాటికి ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యే అవకాశముంది. అక్కడకు కొద్దిరోజులకే నోటిఫికేషన్ వెలువడే చాన్స్ ఉంది. కానీ సుప్రీం కోర్టు మాత్రం అమరావతి రాజధాని కేసు విచారణను డిసెంబరు వరకూ తేల్చే చాన్సేలేదని తేల్చిచెప్పింది. అత్యవసర కేసుల విచారణ ఉన్నందున.. అమరావతి కేసుల విచారణ చేపట్టలేమని చెప్పడంతో జగన్ సర్కారు నోటీలో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది.

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించారు. అమరావతిని శాసన రాజధానికి పరిమితం చేశారు. అటు కర్నూలను న్యాయ రాజధానిగా చేస్తూ హైకోర్టు ఏర్పాటుచేస్తామని చెప్పుకొచ్చారు. దీనిపై అమరావతి రైతులు ఉద్యమ బాట పట్టారు. సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నారు. ఒక్క వైసీపీ తప్ప అన్ని రాజకీయ పక్షాలు అమరావతికి మద్దతు ప్రకటించాయి. అటు న్యాయస్థానాల్లో సైతం జగన్ సర్కారుకు ఎదురుదెబ్బలు తగులుతూ వస్తున్నాయి. ఆరు నెలల్లో అమరావతి నగరాన్ని కట్టాల్సిందేనని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే దీనిపై సుప్రీం కోర్టులో సవాల్ చేసిన జగన్ సర్కారుకు స్వల్ప ఉపశమనమే తప్ప.. సానుకూల తీర్పు ఇంతవరకూ రాలేదు.

అదిగో విశాఖకు వచ్చేస్తున్నాం…ఇదిగో విశాఖకు వస్తున్నాం అన్న ప్రకటనలే తప్ప.. వచ్చిన దాఖలాలు లేవు. సీఎం నుంచి మంత్రుల వరకూ ఇచ్చిన గడువులు మారుతున్నాయే తప్ప విశాఖ నుంచి పాలన ప్రారంభం కాలేదు. అటు సీఎం క్యాంపు ఆఫీసును విశాఖ లో ఏర్పాటుచేయాలని భావించినా.. అది కూడా కార్యరూపం దాల్చలేదు. మొత్తానికైతే ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా జగన్ నిలబెట్టారు. జాతీయ స్థాయిలో పలుచన అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు సమీపించేసరికి మల్లగుల్లాలు పడుతున్నారు.

తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలతో వైసీపీ శ్రేణులు నీరుగారిపోయాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు , మంత్రులు భయపడిపోతున్నారు. రాజధానుల అంశం తేల్చకుంటే ప్రజల మధ్యన చులకన అయిపోవడం ఖాయమని కలవరపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో యువత నుంచి నిలదీతలు, ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. విపక్షాలకు ఇదో ప్రచారాస్త్రంగా మిగులుతుందని.. ఏరి కోరి కష్టాలు తెచ్చుకోవడం అంటే ఇదేనని హైకమాండ్ తీరును తప్పుపడుతున్నారు. రాజధాని ఇష్యూ మెడకు చుట్టుకోవడం ఖాయమని అంతర్గత చర్చల్లో నేతలు ప్రస్తావిస్తున్నారు. మొత్తానికైతే ఎన్నికల ముంగిట అమరావతి రాజధాని ఇష్యూ ముగిసే అవకాశాలు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు.