Tragedy In Tirumala: తిరుమలలో భక్తుల ప్రాణాలను స్వామికి వదిలేసిన టీటీడీ

చిన్నారి లక్షిత స్వస్థలం నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డి పాలెం. తల్లిదండ్రులు దినేష్ కుమార్,శశికళ,ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చిరుత దాడిలో చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Written By: Dharma, Updated On : August 12, 2023 10:16 am

Tragedy In Tirumala

Follow us on

Tragedy In Tirumala: తిరుమల కొండపై తీవ్ర విషాదం నెలకొంది. అలిపిరి నడక మార్గంలో చిరుతదాడిలో 8 ఏళ్ల బాలిక మృతి చెందింది. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో చిన్నారి లక్షిత కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన కొండకు వెళ్తున్నారు. అదే సమయంలో ముందు వెళ్తున్న చిన్నారిపై అడవిలో నుంచి వచ్చిన చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. చిన్నారి తల్లిదండ్రులు భయంతో గట్టిగా అరవడంతో చిరుత లక్షితను అడవిలోకి ఈడ్చుకొని పోయింది. ఈ హఠాత్పరిణామంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

అప్పటికే రాత్రి 10 గంటల సమయం అయ్యింది. గాలింపు చర్యలకు వీలు కాలేదు. శనివారం ఉదయం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలో చిన్నారి మృతదేహం వెలుగు చూసింది. అప్పటికే సగం శరీరాన్ని తినేసింది. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

చిన్నారి లక్షిత స్వస్థలం నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డి పాలెం. తల్లిదండ్రులు దినేష్ కుమార్,శశికళ,ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చిరుత దాడిలో చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనతో భక్తులు షాక్ గురయ్యారు. తిరుమలలో తీవ్ర విషాదం అలుముకుంది.

ఇటీవల తిరుమలలో జరుగుతున్న ఘటనలు భక్తులను కలచివేస్తున్నాయి. అటవీ జంతులు హల్చల్ చేస్తున్నాయి. కాలినడక మార్గంలో వెళ్తున్న వారిపై దాడి చేస్తున్నాయి. సరిగ్గా నెల రోజుల కిందట ఐదేళ్ల బాలుడు పై చిరుత దాడి చేసింది. గాయాలతో బాలుడు బయటపడ్డాడు. ఇప్పుడు అదే స్థలంలో చిరుత దాడి చేయడంతో భక్తుల్లో భయాందోళన నెలకొంది. తిరుమలలో భక్తుల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అటవీ జంతువులు భక్తులపై దాడి చేస్తుండడం సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా టీటీడీ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.