TPCC Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ప్రభుత్వంపై పోరాడేందుకు పలు మార్గాలు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో రేవంత్ రెడ్డి దిల్ సుఖ్ నగర్ నుంచి ఎల్బీనగర్ పాదయాత్ర చేయాలని నిర్ణయించినా పోలీసులు అడ్డుకోవడంతో రద్దయింది. దీనిపై కాంగ్రెస్ నేతలు రోడ్లపై నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరును ఖండించారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన శ్రీకాంత చారికి నివాళులర్పించే క్రమంలో ఈ కార్యక్రమం రూపకల్పన జరిగింది. కానీ ప్రభుత్వం మధ్యలోనే అడ్డుకుంది. దీంతో పార్టీ నేతలు పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. శ్రీకాంత చారికి దండలు వేసి నివాళులర్పిస్తే ప్రభుత్వానికి ఏం పోతుందని నిరసన తెలిపారు. రాష్ర్టంలో రాక్షస పాలన సాగుతోందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్య నేతల్ని అరెస్టు చేసి నిర్బంధించారు.
తెలంగాణ కోసం అమరులైన వారిని టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇందులో భాగంగా ఆయన తల్లి శంకరమ్మకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా ఆమె గెలవకపోవడంతో ఆమెకు ఎలాంటి పదవులు దక్కలేదు. దీంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయాలని భావించింది. ఇందులో భాగంగానే పాదయాత్ర చేయాలని సంకల్పించింది. శ్రీకాంత్ చారి ఆశయాలకు అనుగుణంగానే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతోంది.
నిరుద్యోగ యువతకు కూడా ప్రభుత్వం ఏ రకమైన ప్రయోజనాలు కల్పించలేదు. ఉద్యోగాల కల్పన ఓ కలగానే మిగిలిపోతోంది. దీంతో కాంగ్రెస్ వారి ఆశలకు అనుగుణంగా పోరాటం చేయాలని భావించింది. కానీ ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం కాకుండా చేసేందుకు ప్రయత్నించింది. నేతలను ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ హౌస్ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి శ్రీకాంత్ చారి రూపంలో మరో ఆయుధం దొరికినట్లయింది.