తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న పీసీసీ చీఫ్.. ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ కేడర్ ను కార్యోన్ముఖులను చేసేందుకు కృషి చేస్తున్నారు. శనివారం హైదరాబాద్ లో యువజన కాంగ్రెస్ విస్తరణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణికం ఠాగూర్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్బంగా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ వైపసే చూస్తున్నారని అన్నారు. నాయకులు, కేడర్ సైనికుల్లా టీఆర్ ఎస్ సర్కారుతో పోరాడాల్సి ఉందన్నారు. అప్పుడే.. సోనియా రాజ్యం వస్తుందన్నారు రేవంత్. ఇప్పటి నుంచి సరిగ్గా 20 నెలలపాటు కష్టపడి పనిచేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ విధంగా.. కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తూనే.. హెచ్చరికలు సైతం జారీచేశారు రేవంత్. జుట్టు చెరగకుండా.. చేతులకు మట్టి అంటకుండా పనిచేస్తున్నట్టు నటించే నాయకులకు ప్రాధాన్యం ఉండబోదని తేల్చి చెప్పారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కదని హెచ్చరించారు. నిస్వార్థంగా, కష్టపడి పనిచేసే వారికే కాంగ్రెస్ టికెట్ వస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ సంక్షోభంలో ఉందన్న రేవంత్.. ప్రజలకు నమ్మకం కలిగించేలా కృషి చేయాలని సూచించారు.
ఇక, కాంగ్రెస్ కేడర్ కు కీలక సూచన కూడా చేశారు రేవంత్. పార్టీ కార్యకర్తలు, యువకులు తన రాజకీయ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పార్టీ మారిన ప్రతిసారీ విపక్షంలోనే చేరినట్టు గుర్తు చేశారు. ప్రజలకోసం నిస్వార్థంగా పనిచేశానని, ఆ విధంగా 15 ఏళ్లలోనే కాంగ్రెస్ అధ్యక్ష స్థాయికి చేరుకున్నట్టు చెప్పారు రేవంత్. అంతేకాదు.. వైఎస్, చంద్రబాబు, కేసీఆర్, మమతా బెనర్జీ తదితరులు యువజన కాంగ్రెస్ లోనే పనిచేశారని కూడా గుర్తు చేశారు.
కాగా.. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పుడే టికెట్ల ప్రస్తావన తేవడం ద్వారా కాంగ్రెస్ లో చర్చ మొదలైంది. రేవంత్ కేవలం యువ నేతలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారా? లేదంటే.. సీనియర్లకు సైతం ఈ వ్యాఖ్యలు వర్తిస్తాయా? అని చర్చించుకుంటున్నారు. ఇప్పటికీ.. పలువురు సీనియర్లు రేవంత్ తో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. మరి, రేవంత్ పీసీసీ బాస్ కాబట్టి.. టికెట్ల ఎంపిక మేజర్ గా ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా సీనియర్లను సైతం హెచ్చరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Tpcc chief revanth reddy says hard workers only will get congress ticket in 2023 elections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com