Revanth Reddy: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు 100కు పైగా స్థానాల్లో ముందంజలో ఉన్నారు.. 11 గంటల వరకు స్పష్టంగా కనిపించిన ట్రెండ్.. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది.. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఓటమి పరోక్షంగా అంగీకరించారు.. కర్ణాటక ఫలితాలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు.. కర్ణాటకలో ఫలితాలే తెలంగాణలో పునరావృతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
బజరంగ్ బళి
కర్ణాటక ఎన్నికల్లో జై భజరంగబలి అంటూ బిజెపికి ఓటు వేయాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారని, కానీ అక్కడి ఓటర్లు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని రేవంత్ రెడ్డి అంటున్నారు.. కర్ణాటకలో జేడీఎస్ ఓడిందంటే తెలంగాణలోనూ అవే ఫలితాలు వస్తాయని ఆయన చెబుతున్నారు. కుమార స్వామికి కెసిఆర్ సహకారం అందించారని, ఇప్పుడు బిజెపి నేతలతో జెడిఎస్ నేతలు టచ్ లో ఉండటం పైన కూడా కెసిఆర్ స్పందించాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు.. రాముడిని అడ్డుపెట్టుకొని పార్టీని విస్తరించుకోవాలనుకోవడం బిజెపి మానుకోవాలన్నారు. కర్ణాటకలో ఓటర్లు బిజెపిని ఓడించి ప్రధానమంత్రిని, జేడీఎస్ ను తిరస్కరించి కెసిఆర్ కు చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పారని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
స్పష్టమైన మెజారిటీ దిశగా
హంగ్ దిశగా ఫలితాలు వస్తాయి అనుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టారని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కెసిఆర్ మద్దతు ఇచ్చిన జెడిఎస్ ఓడిపోయిందని, జెడిఎస్ తో పాటు కెసిఆర్ ఓడిపోయినట్టేనని రేవంత్ వ్యాఖ్యానించారు. బిజెపి మత రాజకీయాలను కన్నడ ప్రజలు తిప్పి కొట్టారని విశ్లేషించారు. రాహుల్ జోడో యాత్రతోనే కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్రంలో విజయం సాధించిందని పేర్కొన్నారు.. ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంటే.. బిజెపి కార్యాలయం బోసిపోయి కనిపిస్తోంది.