Revanth Reddy Vs Kavitha: దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమ్మాయులు, మహిళలపై ఎలాంటి చిన్న ఘటన జరిగినా సోషల్ మీడియా వేదికగా దేశం ఏమైపోతోంది.. మహిళలకు రక్షణ లేదు.. అంటూ గగ్గోలు పెడతారు తెలంగాణ ముఖ్యమంత్రి గారాల తనయ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత. దేశం మొత్తానికి తానొక్కదాన్నే ఆడపడుచును.. మోదీని నిలదీసే ధీర వనితను అని కలరింగ్ ఇచ్చుకుంటారు. ఇటీవల తన ఒత్తిడితోనే కేంద్ర మహిళా బిల్లు పార్లమెంటులో పెట్టిందని ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇదంతా నిజమే అనుకుందాం.. మరి తెలంగాణ ఆడ పడుచులకు ఏమైనా అయితే మాత్రం కవిత ట్విటర్ పిట్ట కూయదు.. కనీసం సంతాపం కూడా ప్రకటించదు. దేశ మహిళల సమస్యను తన సమస్య అనుకునే కవితక్క.. తెలంగాణ ఆడబిడ్డకు ఏమైనా పట్టించుకోరనే అపవాదు మూటగట్టుకున్నారు. అపవాదు నిజమే అని తాజాగా మరోమారు నిరూపించుకున్నారు. ఉద్యోగ పరీక్షలు వరుసగా రద్దవుతున్నాయని మనస్తాపం చెందిన హైదరాబాద్ అశోక్‌నగర్‌లో యువతి ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుంది. నిరుద్యోగ యువతి ఆత్మహత్యపై ఎమ్మెల్సీ కవిత కనీసం స్పందించకపోగా, తన బతుకమ్మ పాటను ప్రమోట్ చేసుకునేలా ట్వీట్‌లో పాట పోస్టు చేశారు.
మండిపడ్డ టీపీసీసీ చీఫ్..
కవిత ట్వీట్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆమో ట్వీట్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘బతుకమ్మ సంబరాల గురించి రంగురంగుల వీడియోలు పెట్టే ఎమ్మెల్సీ కవితకు గ్రూప్ పరీక్షల నిర్వహణ అవకతవకలతో బతుకు భారమై, భవిత ఆగమై ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక ఆత్మ ఘోష వినబడటం లేదా’ అని ట్విట్టర్లో ప్రశ్నించారు. ఆడబిడ్డల హక్కులు మీ దృష్టిలో రాజకీయ అంగడి సరుకే తప్ప.. పొలిటికల్ స్లోగన్లు తప్ప మానవీయ ఎజెండాలు కాదని విమర్శించారు. ‘బతుకమ్మ ఆడబిడ్డల ఆత్మీయ సంగమం. మన తెలంగాన ఆత్మగౌరవ సంబంరం. బతుకమ్మ శుభాకాంక్షలతో ఈ ఏడాది బతుకమ్మ పాటలు మీకోసం’ అంటూ ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోను రేవంత్ తన రీ ట్వీట్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు.
ప్రవళిక అంత్యక్రియలు పూర్తి..
ఇదిలా ఉండగా ఆత్మహత్య చేసుకున్న వరంగల్ విద్యార్థిని మర్రి ప్రవల్లిక(25) హైదరాబాద్ లో అక్టోబర్ 13న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆమె అశోక్ నగర్‌లో తాను ఉంటున్న బృందావన్ బాలికల హాస్టల్‌లో ఉరేసుకుంది. ఈ విషయం తెలిసి నిరుద్యోగులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం వరంగలో లోని ఆమె స్వగ్రామానికి ప్రవల్లిక మృతదేహాన్ని తరలించారు. భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు పూర్తి చేయించారు పోలీసులు.