Huzurabad and Badvel: దేశంలో ఉప ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంది. దీంతో పార్టీల్లో అప్పుడే ప్రచారం సాగుతోంది. ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తెలంగాణలో హుజురాబాద్, ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్ శాసనసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపడంతో ఇక్కడ ఉప ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పోలింగు ఏర్పాట్లు చేస్తోంది.

హుజురాబాద్ లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. భూకబ్జా ఆరోపణలతో ప్రభుత్వం నుంచి బహిష్కరించడంతో ఈటల మంత్రి పదవి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ లో కూడా ఉప ఎన్నిక జరిపేందుకు సిద్దమైంది. బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మార్చి 26న కన్నుమూయడంతో అక్కడ ఉప ఎన్నిక కోసం అధికార యంత్రాంగం పనులు ముమ్మరం చేస్తోంది. హుజురాబాద్ లో హోరాహోరీగా పోరు సాగనుందని తెలుస్తోంది.
బద్వేల్ లో వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య దాదాపు 44 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నారు. తాజాగా బద్వేల్ ను రెవెన్యూ డివిజన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రభుత్వం ఇక్కడ విజయం సాధించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ గెలుపే ప్రధానంగా ముందుకు సాగుతోంది. ఇక్కడ వన్ సైడ్ పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇన్నాళ్లు కరోనా ఉధృతి కారణంగా ఉప ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చిన ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో అందరి దృష్టి ఈ రెండు నియోజకవర్గాలపైనే ఉన్నా పోటీ మాత్రం హుజురాబాద్ లోనే ఉంటుందని తెలుస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా మారనుందని సమాచారం.