తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. ఇన్నాళ్లు ప్రచారంతో హోరెత్తించిన పార్టీలు ఇప్పుడు ప్రజలకు మందు, విందులు, తాయిలాలతో డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ రాత్రి చేపట్టాయి. తిరుపతిలోని 7 నియోజకవర్గాల్లో భారీగా ఓటుకు నోట్లు పంచుతున్నారని సమాచారం.
తిరుపతి పార్లమెంట్ పరిధిలో మొత్తం 17 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడింటిలో మూడు చిత్తూరు జిల్లాలో.. నాలుగు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. అన్నింట్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే గెలిచారు. దీంతో తిరుపతి పార్లమెంట్ లో వైసీపీ పార్టీకి కాస్త మొగ్గు కనిపిస్తోంది.
2019 తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ తన సమీప టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీపై 2,28,576 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దురదృష్టవశాత్తూ ఆయన చనిపోవడంతో ఇప్పుడు ఉప ఎన్నికలొచ్చాయి.
ఇందులో వైసీపీ నుంచి గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాకలక్ష్మీ, బీజేపీ-జనసేన నుంచి రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ బరిలో ఉన్నారు. వీరిందరిలోకి గురుమూర్తినే చిన్న వయసుగల వాడు కావడం గమనార్హం.
ఇక గత ఎన్నికల్లో నోటా మూడో స్థానంలో నిలవడం విశేషం. ఇక్కడ కాంగ్రెస్ నాలుగో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కు 24039 ఓట్లు వచ్చాయి. ఇక నోటాకు 25781 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరిరావు కు 16125 ఓట్లు, జనసేన-బీఎస్పీ అభ్యర్థి దగ్గుమాటి శ్రీహరిరావుకు 20971 ఓట్లు వచ్చాయి.
ఈసారి మాత్రం బీజేపీ-జనసేన తిరుపతిలో బలంగా నిలబడ్డాయి. హోరాహోరీ ప్రచారం చేశాయి. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి జూనియర్ కావడం.. జగన్ ప్రచారానికి రాకపోవడం మైనస్ గా మారింది. ఇక విపక్ష టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి అంత ఆదరణ దక్కలేదు. దీంతో రేపు జరిగే పోలింగ్ లో ఓటర్లు ఎవరికి ఓటేస్తారన్నది ఆసక్తిగా మారింది.