Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇందుకుగాను ప్రభుత్వం బుధవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. అయితే తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఈ అవకాశం కల్పించారు. వారు తెలంగాణలో ఓటర్ కార్డు చూపితే ఆర్జిత సెలవు ఇవ్వాలని అన్ని శాఖలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
2014లో రాష్ట్ర విభజన జరిగింది. అక్కడ కొద్ది రోజులకు అమరావతి రాజధాని ప్రకటన వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అధికారుల విభజన సైతం పూర్తయింది. అయితే దాదాపు పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో చాలామంది కుటుంబాలను అక్కడే విడిచిపెట్టారు. పిల్లల చదువులు, ఇతరత్రా అవసరాలు ఉండడంతో విజయవాడ నుంచి రాకపోకలు సాగించేవారు. ఇటువంటి పరిస్థితుల్లో చాలామందికి తెలంగాణలోనే ఓట్లు ఉన్నాయి.
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి గురువారం పోలింగ్ జరగనుండడంతో బుధవారం ఏపీ సర్కార్ ఈ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు తెలంగాణ ఓటర్లు అయితే కచ్చితంగా ఆర్జిత సెలవు ఇవ్వాలని అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చాలామంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు సెలవు తీసుకుంటున్నారు.