Tollywood Jagan: ఆరునెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. అమరావతి వెళ్లి మరీ సీఎం జగన్ ను కలిసిన మెగా స్టార్ చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి, ఆర్.నారాయణమూర్తి చివరకు అనుకున్నది సాధించారు. సినీ సమస్యలపై జగన్ సానుకూలంగా స్పందించి త్వరలోనే జీవో విడుదల చేయడానికి రెడీ అయ్యారు.ఈనెలాఖరులోపే ఆ జీవో వస్తుందని.. సమస్యలకు శుభం కార్డు పడుతుందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. టికెట్ ధరలకు శుభం కార్డ్ పడినట్లుగా తాము భావిస్తున్నామని చిరంజీవి తెలిపారు.
-చిరంజీవి స్పందన
ఇక చిన్న సినిమాల ఐదోషోకు సీఎం జగన్ అనుమతించడం శుభపరిణామం అని చిరంజీవి తెలిపారు. అటు సామాన్య ప్రజలకు, ఇటు ఇండస్ట్రీకి మంచి జరగాలనే ఉద్దేశంతో గతంలో నేను చర్చించిన అంశాల సారాంశాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్ మాట్లాడారు. అందరికీ లాభదాయకంగా ఉండేలా జగన్ తీసుకున్న నిర్ణయం సంతోషపరిచిందని చిరంజీవి అన్నారు.
దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలకు గొప్ప కీర్తి లభిస్తోందని.. అందుకు కారణమైన భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రత్యేకించి వెసులుబాటు కల్పించాలని కోరగా.. దానిపై మరోసారి కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. తెలంగాణలో లాగానే ఏపీలోనూ చిత్ర పరిశ్రమ వృద్ధి చెందాలని జగన్ సూచించారు. అందుకు కావాల్సిన అన్ని సహకారాలు చేస్తానన్నారు.
విశాఖలో సినిమా షూటింగ్స్ కు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటానని జగన్ హామీ ఇచ్చారు.అందుకు సహకరిస్తామన్నారు. ఈ చర్చల విషయంలో ముందు నుంచి మాకు ఎంతో మద్దతుగా నిలిచిన మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు తెలిపారు సినీ ప్రముఖులు.
పేర్ని నాని ,చిరంజీవిల చొరవ వల్లే సినీ సమస్యలకు శుభంకార్డు పడింది. ఇకపై ఎలాంటి సమస్య వచ్చినా చర్చలతో సామరస్యంగా పరిష్కరించుకుంటామని.. ఈనెల మూడో వారంలోపు సినీ పరిశ్రమకు సంబంధించిన జీవో వచ్చే అవకాశం ఉందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.
-మహేష్ ఏమన్నారంటే?
ఆరునెలలుగా చిత్రపరిశ్రమ అయోమయంలో ఉందని.. ఈరోజుతో పెద్ద రిలీఫ్ వచ్చిందని.. చొరవచూపిన చిరంజీవి, సీఎం జగన్, మంత్రి పేర్ని నానిగారికి హీరో మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. వారం, పదిరోజుల్లోనే దీనిపై గుడ్ న్యూస్ వింటామన్నారు.
-రాజమౌళి
జగన్ చూపిన చొరవ చూసి ఆనందం కలిగిందని.. మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు ధన్యవాదాలని రాజమౌళి అన్నారు. చిరంజీవిని సినిమా పెద్ద అంటే ఆయనకు నచ్చదు కానీ.. చేసే పనుల వల్ల ఆయన పెద్దరికం తెలుస్తోందన్నారు. సినీ పరిశ్రమ కోసం చిరంజీవి శ్రమించారన్నారు.