Chandrababu Case: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో నేడు కీలక పరిణామం. ఈ కేసులో అరెస్టు అయిన చంద్రబాబు ప్రస్తుతం మద్యంతర బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ గడువు పొడిగించాలని.. రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఈనెల 17న విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. నేడు మధ్యాహ్నం 2:30 గంటలకు తీర్పు వెల్లడించనున్నారు.
ఈ కేసులో చంద్రబాబు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వ్ చేశారు. కానీ ఇంతవరకు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అనారోగ్య కారణాలు చూపుతూ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీంతో కోర్టు షరతులతో కూడిన మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 28 వరకు గడువు ఇచ్చింది. అయితే చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని.. ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని మెడికల్ రిపోర్టును సైతం చంద్రబాబు తరుపు న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు.
ఈనెల 17న కోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్ర, దుమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సిఐడి తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఎన్నికల ముంగిట రాజకీయ కక్షతోనే ఈ కేసు నమోదు చేశారని చంద్రబాబు న్యాయవాదులు వాదించారు. అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అదనపు ఏజీ కోర్టును తప్పుదోవ పట్టించారని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.దీనిపై అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు మెడికల్ రిపోర్టులో అంశాలు నమ్మశక్యంగా లేవని.. పైగా కోర్టు ఆదేశాలను చంద్రబాబు బేఖాతరు చేశారని.. షరతులు ఉల్లంఘించారని.. ఆయనకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విని తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. నేడు వెల్లడించనున్నారు. దీంతో ఎలాంటి తీర్పు వస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.