Pawan Kalyan- MLC Election: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రస్తుతం ఓటు నమోదు ప్రక్రియ చురుగ్గా జరుగుతోంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికార వైసీపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ను రంగంలోకి దించింది. అటు టీడీపీ జీవీఎంసీ కార్పొరేటర్, బీసీ మహిళ గాడు చిన్నకుమారిని పోటీలో పెట్టింది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మరోసారి పోటీచేస్తున్నారు. అయితే ఇప్పుడు జనసేన నిర్ణయం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. జనసేన అటు బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. ఇటు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీతో కూడా జనసేనకు మంచి వాతావరణమే ఉంది. దీంతో ఇరు పార్టీలు పవన్ తమకంటే తమకే మద్దతు తెలుపుతాడని ఎంతో ఆశతో ఉన్నాయి. కానీ జనసేన నుంచి ఎటువంటి ప్రకటన రావడం లేదు.

వాస్తవానికి ఉత్తరాంధ్రలో జనసేన గ్రాఫ్ గణనీయంగా పెరిగినట్టు సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి నిఘా వర్గాలు కూడా ఇదే తేటతెల్లం చేశాయి. పవన్ కు యువత, విద్యార్థుల ఫాలోయింగ్ ఎక్కువ. 2017 ఎన్నికల్లో 31 వేల గ్రాడ్యుయేట్ల ఓట్లు నమోదయ్యాయి. నాడు టీడీపీ సహకారంతో బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి మాధవ్ సునాయాసంగా విజయం సాధించారు. నాడు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ సహకారంతో సాధ్యమైంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా విభజన సమస్యలు పరిష్కరించడం లేదని.. రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడం లేదని.. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ప్రకటించలేదని బీజేపీ పై ఒకరకమైన అపవాదు ఉంది. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ రూపంలో కేంద్రం వ్యతిరేకత మూటగట్టుకుంది. దీంతో బీజేపీకి ఈసారి ఎదురుగాలి వీయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
అటు టీడీపీ పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. వైసీపీ క్యాండిడేట్ ను పెట్టింది కనుక.. తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ పెట్టాల్సి వచ్చింది. అయితే ఇప్పటివరకూ వేరే అభ్యర్థికి మద్దతు ఇవ్వడమే తప్ప టీడీపీ పోటీచేసిన సందర్భాలు లేవు. తొలిసారిగా బీసీ వర్గానికి చెందిన మహిళను చంద్రబాబు ఖరారు చేశారు. ఆమెను గెలిపించే బాధ్యత తీసుకోవాలని మూడు జిల్లాల నేతలకు అప్పగించారు. కానీ టీడీపీ నేతలు ఏమంత చురుగ్గా పనిచేయడం లేదు. ఓటు ఎన్ రోల్ మెంట్ పై కూడా దృష్టిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పవన్ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పవన్ మద్దతు ప్రకటిస్తే విజయం ఖాయమని భావిస్తున్నారు. కానీ జనసేనాని నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడడం లేదు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ, టీడీపీలో ఏదో ఒక పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం జనసేనకు అనివార్యంగా మారింది. అటు బీజేపీని కాదని టీడీపీతో నడిస్తే ఒకరకమైన సంకేతాలు వెలువడతాయి… అటు బీజేపీకి సపోర్టు చేసినా అదే పరిస్థితి. అలాగని వైసీపీ, వామపక్షాల అభ్యర్థులకు మద్దతు ప్రకటించలేని పరిస్థితి. కానీ పవన్ మద్దతిస్తే మాత్రం అటు టీడీపీయో.. బీజేపీనో గెలిచే చాన్స్ మాత్రం ఉంది. అయితే ఎందుకొచ్చింది గొడవ. జనసేన నుంచి ఒక అభ్యర్థిని దించితే పోలేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని పవన్ చెవిన వేశాయి. ఒకటి రెండు రోజుల్లో జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడే అవకాశముంది. వీలైనంత వరకూ ఈ ఎన్నికల్లో జనసేన తటస్థంగా ఉండే చాన్స్ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.