Chandrababu modi
Cm chandrababu Naidu : కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టింది. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సొంతం చేసుకున్నారు నరేంద్ర మోడీ.అదే సమయంలో నవ్యాంధ్రప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. 74 ఏళ్ల ఆయన జీవితంలో 45 ఏళ్లుగా ప్రజానాయకుడుగానే కొనసాగుతున్నారు. ఆయన జీవితంలో గెలుపోటములు అతి సాధారణం. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే.. 15 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైన టిడిపి.. ఈ ఎన్నికల్లో బిజెపి, జనసేనతో జతకట్టి దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ఘోర ఓటమిని.. ఘనవిజయంగా మార్చడం అందరికీ సాధ్యం కాదు. కానీ అది చేసి చూపారు చంద్రబాబు. బిజెపి నేతృత్వంలో కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలోనూ కీలకంగా మారారు. జాతీయస్థాయిలో సైతం సత్తా చాటారు. టిడిపికి పునర్ వైభవం కల్పించారు. దాదాపు టిడిపి పని అయిపోయిందనుకున్నప్పుడల్లా పార్టీని అధికారంలోకి తీసుకురావడం చంద్రబాబు గొప్పతనం. 2004, 2009లో వరుసగా అధికారం కోల్పోయినప్పటికీ.. తెలంగాణ ఉద్యమ ప్రభావాన్ని పట్టుకొని మరి పార్టీని పటిష్టం చేయగలిగారు చంద్రబాబు. విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారిగా అధికారంలోకి రాగలిగారు. 2019 ఎన్నికల్లో 23 సీట్లు సాధించడంతో టిడిపి ఉనికి ప్రశ్నార్ధకమయ్యింది. కానీ పడి లేచిన కెరటంలా టిడిపిని విజయపథంలో దూసుకెళ్లే విధంగా అడుగులు వేశారు చంద్రబాబు. ఏకంగా 135 సీట్లు సాధించడం ద్వారా సరైన సమాధానం ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్దే అభిమత్తంగా ముందుకు సాగనున్నారు. అందుకే ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారు. అభివృద్ధికి ప్రణాళిక వేసుకున్నారు.
*జాతీయస్థాయిలో కింగ్ మేకర్
మరోసారి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే ఛాన్స్ దక్కించుకున్నారు చంద్రబాబు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. ఈ ఎన్నికల్లో బిజెపి 240 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. మ్యాజిక్ ఫిగర్ కు మరో 40 స్థానాలకు దూరంగా నిలిచింది. ఈ తరుణంలో టిడిపికి లభించిన 16 పార్లమెంట్ స్థానాలు కీలకంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం సుస్థిరతలో చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ అవసరం ఏర్పడింది. అందుకే ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం పరితపిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకు అవసరమైన నిధులు, మద్దతును కేంద్రం నుంచి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
* అనేక సవాళ్లు
నవ్యాంధ్రప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. అమరావతిని పూర్తిస్థాయిలో రాజధానిగా తీర్చిదిద్దడం, పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పోలవరం నిర్మాణం వంటివి కొత్త ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలు. వీటిని పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. విభజన ఆంధ్ర ప్రదేశ్ తొలి సీఎం గా ఉన్నప్పటి కంటే.. వచ్చే ఐదేళ్ల కాలమే చంద్రబాబుకు అత్యంత కీలకం. అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. జాతీయస్థాయిలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు.
* కేంద్ర సాయం ప్రారంభం
అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15000 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి తమ వంతు సాయం నిరంతరాయంగా కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఏపీ పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు, ఇతరత్రా రాయితీలు కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. కీలకమైన ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. ఇవన్నీ చంద్రబాబు కృషి మేరకు జరిగినవే. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీ వెళ్లారు చంద్రబాబు. ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర సమస్యలను విన్నవించారు. తమ రాష్ట్రానికి ఏం కావాలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు వివరించారు. అవన్నీ వర్కౌట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అందుకే కేంద్రం సైతం ఏపీ విషయంలోఅత్యంత శ్రద్ధతో ఉంది. 2014 రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్లు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా.. రాష్ట్రానికి కేటాయింపులు అంతంత మాత్రమే. కానీ ఈసారి మాత్రం తప్పక కేటాయింపులు చేయని పరిస్థితి ఎదురైంది. దానిని బాగానే వినియోగించుకుంటున్నారు చంద్రబాబు.
* శత్రువును ఎలా దెబ్బ కొట్టాలో తెలుసు
శత్రువును దెబ్బ కొట్టాలంటే ఎలాంటి ఎత్తులు వేయాలో చంద్రబాబుకు తెలుసు. 2019లో అంతులేని మెజారిటీతో విజయం సాధించారు జగన్. ఈ ఎన్నికల్లో కూడా కూటమిని దెబ్బతీయాలని భావించారు. కానీ తన రాజకీయ అనుభవం, తెలివితో తిప్పికొట్టారు. అక్రమ కేసుల్లో అరెస్టు చేసి సుమారు 52 రోజుల పాటు జైలులో ఉంచినా చలించలేదు. వయసును సైతం లెక్క చేయలేదు. ప్రజల్లో బలంగా తిరిగారు. ఏడుపదుల వయసులో ఏకంగా 100 ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి విజయానికి మాస్టర్ మైండ్ గా మారి, కేంద్రంలో గేమ్ చేజర్ అయ్యారు. ఈ అసెంబ్లీ వేదికగా శపథం చేశారో.. దానిని సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు చంద్రబాబు. ఏపీ అభివృద్ధిపై ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: To what extent will it benefit andhra pradesh as chandrababu is key in the central government
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com