బెంగాల్ పీఠం మరోసారి దీదీకే దక్కనుంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలకు గాను టీఎంసీ 187 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ కేవలం 98 స్థానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక సీఎం మమతా బెనర్జీ నందిగ్రాంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై వెనుకంజలో ఉండడం టీఎంసీని కలవరపెడుతోంది.
బెంగాల్ లో బీజేపీని తోసిరాజని టీఎంసీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ నందిగ్రాంలో మమతా బెనర్జీ ఓడిపోతుందా? అన్న భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది.
బెంగాల్ లో బీజేపీ వర్సెస్ టీఎంసీ వార్ ఓ రేంజ్ లో సాగింది. మోడీ , అమిత్ షా ఇద్దరూ బెంగాల్ పై యుద్దం ప్రకటించి మమత బెనర్జీని ఎలాగైనా ఓడించే ప్రయత్నం చేశారు కానీ అది సాధ్యపడలేదని తేలింది.
బెంగాల్ లో ఎన్నికల కౌంటింగ్ లో మొదటి నుంచి టీఎంసీ హవా సాగుతోంది. ఇప్పటి వరకైతే పార్టీల పరంగా తృణమూల్ ముందంజలో ఉంది. అటు ప్రతిష్టాత్మకంగా మారిన నందిగ్రామ్ నియోజకవర్గంలో రెండో రౌండ్ ముగిసే సరికి మమతా బెనర్జీ వెనకంజలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదేవిధమైన ఫలితాన్ని చెప్పాయి. బెంగాల్ లో స్వల్ప మెజారిటీతో తృణమూల్ గెలుస్తుందని కొన్ని సంస్థలు అంచనా వేశాయి.అన్నట్టుగా టీఎంసీ ఇప్పటికే మ్యాజిక్ మార్క్ దాటేసిన లీడ్ తో బెంగాల్ లో టీఎంసీ విజయం ఖాయంగా కనిపిస్తోంది.