కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న వారిని, టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తులను, గతంలో క్రియాశీలకంగా ఉండి ప్రస్తుతం సైలెంట్ మూడ్ లోకి పోయిన వారిని కలుపుకుని పోయేందుకు రేవంత్ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కోదండరామ్ పార్టీ టీజేఎస్ కూడా కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. కేసీఆర్ ను గద్దె దించడమే ధ్యేయంగా కలిసి పని చేసేందుకు కలిసి పోయేందుకు మొగ్గు చూపుతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. టీజేఎస్ ఎందులో విలీనం కాదని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ కాదు ఏ పార్టీలో కూడా కలిసిపోయే అవకాశం లేదన్నారు. పొత్తుల కోసం కూడా తాను ఎవరిని సంప్రదించలేదని చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నికపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. అప్పట్లో ఆ ప్రచారాన్ని కోదండరామ్ ఖండించారు.
కోదండరామ్ కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుండడంతో ఈమేరకు ప్రచారం సాగుతోంది. కేసీఆర్ కు తెలియకుండా కోదండరామ్ సోనియాగాంధీని కలిశారని గతంలో టీఆర్ఎస్ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. జేఏసీ ముసుగులో ఆయన కాంగ్రెస్ కు పునరుజ్జీవం పోసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు చేశారు. పార్టీ పెట్టాక ఆయన ప్రభావం పెద్దగా చూపలేకపోయారు. దీంతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదనే విషయం తెలుస్తోంది.