అక్రమంగా డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు. ఈరోజుల్లో మంచి పనులు చేస్తే వచ్చేది కొంచెమే. అదే పాడు పనులు చేస్తే ముట్టేది ఘనమే. అడ్డదారుల్లో అందలాలు ఎక్కేందుకు అర్రులు చాస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఆసరాగా చేసుకుని విపరీతంగా డబ్బులు కమాయిస్తున్నారు. అక్రమ సంపాదనపైనే ఆధారపడుతున్నారు. తొందరగా లక్ష్యంచేరే చెడు మార్గాలనే తమ బాటలుగా మలుచుకుంటున్నారు. పోలీసులకు దొరికితే ఇక అంతే సంగతి. అయినా మార్పు రావడం లేదు. నిత్యం అదే అడ్డదారుల్లో వెళుతున్నారు.
అడ్డదారిలో నడిచేందుకు అక్రమ మార్గాలు వెతుక్కుంటున్నారు. కొద్ది సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించి రోజుల్లోనే లక్షలు వెనకేసుకుంటున్నారు. వ్యభిచారాన్నివిస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వాట్సాప్ ద్వారా ఎక్కువ మందిని తమ ఉచ్చులోకి లాగేందుకు రెడీ అవుతున్నారు. దీంతో చుట్టు పక్కల ప్రాంతాలను సైతం టార్గెట్ చేస్తున్నారు.
ఎవరికి అనుమానం రాకుండా ఆన్ లైన్ లో గుట్టుగా వ్యభిచార దందా సాగిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాష్ర్టంలోని బళ్లారికి చెందిన ఇద్దరు మహిళలు బెంగుళూరు, గుడివాడ నుంచి యువతులను తీసుకొచ్చి శ్రీనగర్ కాలనీకి చెందిన సాయిచరణ్, అనిరుద్ అనే యువకులతో కలిసి ఈ దందా నిర్వహిస్తున్నారు.
బెంగుళూరు, గుడివాడ నుంచి యువతులను తీసుకొచ్చి వారి ఫొటోలను వాట్సాప్ ద్వారా విటులకు పంపి వ్యాపారం సాగిస్తున్నారు. ఈ చీకటి వ్యాపారాన్ని గుర్తించిన వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చాడు. రంగంలోకి దిగిన తిరుపతి ఈస్ట్ సీఐ శివప్రసాద్ రెడ్డి వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం చేస్తున్న వారి బాగోతాన్ని బయటపెట్టిన పోలీసులను పలువురు ప్రశంసించారు.