Janasena: వైసీపీలో అభ్యర్థుల మార్పు ప్రకంపనలు ఇప్పట్లో చల్లారే అవకాశం లేదు. పవన్ పై గెలిచిన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని తప్పిస్తూ వైసిపి హై కమాండ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి పార్టీ ఇంచార్జ్ గా ఉన్నారు. మొన్నటి 11 మంది అభ్యర్థుల మార్పు జాబితాలో ఆయన కూడా ఉన్నారు. కొత్త ఇన్చార్జిగా ఉరుకూటి చందును నియమించారు. దీంతో పార్టీకి దేవన్ రెడ్డి రాజీనామా చేశారు. అయితే ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ వైవి సుబ్బారెడ్డి వారించడంతో ఆయన పార్టీలో కొనసాగేందుకు సమ్మతించారు. అయితే అది ఎన్ని రోజులో నిలవలేదు. తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతున్న దేవన్ రెడ్డి జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో తిప్పల నాగిరెడ్డి గాజువాక ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో పవన్ జనసేన అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేశారు. టిడిపి అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్ రంగంలోకి దిగడంతో త్రిముఖ పోటీ నెలకొంది. దీంతో నాగిరెడ్డివిజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. అయితే ఈసారి అక్కడ గెలుపు అంత సునాయాసం కాదు. టిడిపి, జనసేన మధ్య పొత్తు కుదరడంతో వార్ వన్ సైడే నని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో వైసిపి హై కమాండ్ సర్వే చేపట్టింది. అభ్యర్థి మార్పు అనివార్యంగా తేలింది. దీంతో ఊరుకుటి చందును నియోజకవర్గ ఇన్చార్జిగా నియమిస్తూ వైసిపి హై కమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది.
వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేయాలని తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ఆయన ఆశలపై నీళ్లు చల్లుతూ అధిష్టానం మార్పు నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిని దేవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే పార్టీకి రాజీనామా ప్రకటించారు. వై వి సుబ్బారెడ్డి చొరవతో పార్టీలో కొనసాగుతానని ప్రకటించారు. కానీ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనడం లేదు. సీఎం జగన్ జన్మదినోత్సవాలకు సంబంధించి కొత్త ఇన్చార్జ్ చందు ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశానికి పార్టీ శ్రేణులు ఎవరు వెళ్ళవద్దని నాగిరెడ్డి తో పాటు దేవన్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. సరిగ్గా కొత్త ఇంచార్జ్ ఏర్పాటుచేసిన సమావేశ సమయానికే.. ఎమ్మెల్యే నాగిరెడ్డి సైతం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ రెండు సమావేశాలకు దేవన్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో పార్టీకి దూరం కావడానికి దేవన్ రెడ్డి డిసైడ్ అయినట్లు సమాచారం. ఆయన జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది. అయితే ఎమ్మెల్యే అనుచరులు మాత్రం ఖండిస్తున్నారు. దేవన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ దేవన్ రెడ్డి జనసేనలో చేరితే వైసీపీకి కోలుకోలేని దెబ్బ. ఎప్పటికీ టీడీపీ జనసేన పొత్తులో ఉండడంతో ఇక్కడ ఏకపక్ష విజయం నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు తిప్పల కుటుంబం జనసేనలో చేరితే.. వైసీపీ కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.