https://oktelugu.com/

తెలంగాణలో త్రిముఖ పోటీ: టీఆర్ఎస్ కే లాభం?

అధికార టీఆర్ఎస్ కు పోటీగా సమఉజ్జీగా ఏ పార్టీ లేదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డిని పీసీసీ చేయడంతో కొండంత బలం వచ్చింది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ ను తోసిరాజని బీజేపీ తెలంగాణలో రెండోస్థానంలోకి వచ్చింది. కానీ రేవంత్ రాకతో కాంగ్రెస్ ఇప్పుడు బలంగా తయారవుతోంది. దీంతో తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో త్రిముఖ పోటీ ఉండడంపై టీఆర్ఎస్ తో సంతోషంగా ఉందట.. కారణం ఏంటంటే కాంగ్రెస్ […]

Written By: , Updated On : June 28, 2021 / 07:16 PM IST
Follow us on

అధికార టీఆర్ఎస్ కు పోటీగా సమఉజ్జీగా ఏ పార్టీ లేదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డిని పీసీసీ చేయడంతో కొండంత బలం వచ్చింది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ ను తోసిరాజని బీజేపీ తెలంగాణలో రెండోస్థానంలోకి వచ్చింది. కానీ రేవంత్ రాకతో కాంగ్రెస్ ఇప్పుడు బలంగా తయారవుతోంది. దీంతో తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణలో త్రిముఖ పోటీ ఉండడంపై టీఆర్ఎస్ తో సంతోషంగా ఉందట.. కారణం ఏంటంటే కాంగ్రెస్ ఇప్పుడు గణనీయమైన ఓట్లను సంపాదించుకునేందుకు రేవంత్ రెడ్డి లాంటి బలమైన నాయకుడిని ఎంచుకుంది. రేవంత్ రాక టీఆర్ఎస్ కు మంచిదేనంటున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు ఇప్పుడు గంపగుత్తగా బీజేపీకి పడకుండా కాంగ్రెస్, బీజేపీల మధ్య చీలిపోతాయి. అది అంతిమంగా టీఆర్ఎస్ కే లాభం చేకూరుస్తుందని అంటున్నారు.

వాస్తవానికి దుబ్బాక, జీహెచ్ఎంసీల్లో విజయం తర్వాత బీజేపీ బలంగా తయారైంది. తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దెదించేలా కనిపించింది. యువత బీజేపీ వైపు ఆకర్షితులవయ్యారు. బీజేపీ ఏకంగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయంగా తెలంగాణ రాజకీయాల్లో ఉద్బవించింది.

అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఎన్నికలలో బీజేపీ ఘోర ఓటములు ఆ పార్టీకి అంత సీన్ లేదని.. తెలంగాణ వ్యాప్తంగా బలం లేదని నిరూపించింది. కాంగ్రెస్ లా క్షేత్రస్థాయి బలం లేని బలహీనత మరోసారి బయటపడింది. టీఆర్ఎస్ మరోసారి బలం నిరూపించుకుంది.

అయితే బీజేపీకి ఈటల రాజేందర్ రాకతో రీచార్జ్ చేసినట్టు అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి రాకతో ఆ పార్టీ మరింతగా శక్తివంతమవుతుంది. నిరాశగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు ఇది బూస్ట్ లా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తన ప్రసంగాలతో యువ ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షిస్తాడని చెబుతున్నారు. రేవంత్ పోరాట పటిమ కూడా కాంగ్రెస్ ను నిలబెడుతుందంటున్నారు.

పలు కేసుల్లో టీఆర్ఎస్ సర్కార్ అరెస్ట్ చేసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా టీఆర్ఎస్ పై గట్టిగా పోరాడడం.. జనాల్లో ఆయనను హీరోను చేసింది. టీఆర్ఎస్ వ్యతిరేకులకు రేవంత్ ఆశాదీపంలా కనిపిస్తున్నాడు.

దీంతో ఇప్పుడు తెలంగాణలో త్రిముఖ పోటీ అనివార్యంగా మారుతోంది. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు రెండు పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య చీలితే వచ్చేసారి కూడా అధికారం టీఆర్ఎస్ కే సొంతమవుతుంది. ఇది జరుగుతుందా? లేదా అన్నది మాత్రం వేచిచూడాలి.