JanaSena: జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల పై క్లారిటీ వస్తోందా? కొన్ని నియోజకవర్గాల విషయంలో టిడిపి పెద్దగా పట్టించుకోవడం లేదు. కనీసం సమీక్షలు కూడా చేయడం లేదు. అదే సమయంలో అక్కడ జనసేన యాక్టివ్ గా పని చేస్తోంది. దీంతో ఆ సీట్లు జనసేనకు పక్కా అని తేలుతోంది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలపై టీడీపీ ఫోకస్ పెట్టింది. సమీక్షలు కూడా పూర్తి చేసింది. అయితే ఓ రెండు నియోజకవర్గాల విషయంలో మినహాయింపు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇటీవల టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల సమీక్ష చేపట్టారు. కానీ ప్రకాశం జిల్లా చీరాల, విజయవాడ వెస్ట్ విషయంలో మాత్రం ఎవరూ మాట్లాడవద్దని టిడిపి నేతలకు ఆదేశాలు ఇవ్వడం విశేషం. దీంతో ఆ రెండు నియోజకవర్గాలు జనసేనకు కేటాయించినట్లేనని టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో జనసేన చాలా యాక్టివ్ గా ఉంది. అక్కడ కీలక నాయకుడిగా ఉన్న పోతిన మహేష్ జనసేన తరఫున పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఓటమి చవిచూశారు. ఇక్కడ వైసిపి నుంచి మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మరోసారి బరిలో దిగనున్నారు. టిడిపి జనసేన పొత్తులో ఉన్న నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థిగా పోతిన మహేష్ రంగంలోకి దిగితే వెల్లంపల్లి ఓటమి ఖాయమని విశ్లేషణలు వెలవడుతున్నాయి.
చీరాల నియోజకవర్గాన్ని సైతం జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఆమంచి స్వాములు జనసేనలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ టిడిపి అభ్యర్థి కరణం బలరాం విజయం సాధించారు. కానీ ఎన్నికల అనంతరం ఆయన వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో వైసిపి ఇన్చార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ను జగన్ పర్చూరుకు పంపించారు. అయితే ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ సోదరుడు స్వాములు అనూహ్యంగా జనసేన గూటికి చేరారు. దీంతో కృష్ణమోహన్ సైతం జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు చీరాల విషయంలో టిడిపి పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం. ఆమంచి కృష్ణమోహన్, లేకుంటే స్వాముల కోసమే టిడిపి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేనకు సీటు కేటాయిస్తే తప్పకుండా విజయం దక్కుతుందని.. తద్వారా కరణం బలరాంకు చెక్ చెప్పవచ్చని టిడిపి హై కమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే జనసేనకు కీలక నియోజకవర్గాలను కేటాయిస్తూ టిడిపి నిర్ణయం తీసుకోవడం విశేషం.