https://oktelugu.com/

Minister Roja: రోజాకు మద్దతు తెలపని ఆ ముగ్గురు మహిళా మంత్రులు

రాజకీయాల్లో దూకుడు అవసరమే కానీ.. అది తగిన మోతాదులో ఉంటేనే ఎవరైనా హర్షిస్తారు. దాని స్థాయి మించిపోతే రోజా పరిస్థితి ఇలానే వస్తుంది.

Written By:
  • Dharma
  • , Updated On : October 6, 2023 / 09:51 AM IST

    Minister Roja

    Follow us on

    Minister Roja: మంత్రి రోజా మౌన వేదనకు గురవుతున్నారు. తనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలతో తెగ బాధపడుతున్నారు. మహిళలు ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఈ స్థాయికి వస్తారని గుర్తు చేస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు. ప్రత్యేక ప్రెస్ మీట్లతో పాటు ఈ సమావేశానికి వెళ్తున్నా స్త్రీ వివక్షత గురించే మాట్లాడుతున్నారు. అయితే టిడిపి నేతల ఆరోపణల కంటే.. సొంత పార్టీ నేతలు స్పందించకపోవడం పైన ఎక్కువగా బాధపడుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో తనతో పాటు ముగ్గురు మహిళా నేతలు ఉన్నారు. విడదల రజని, తానేటి వనిత, పసుపులేటి ఉషా చరణ్ మంత్రులుగా ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ మంత్రి రోజాపై వచ్చిన ఆరోపణలు ఖండించలేదు. అటు ఫైర్ బ్రాండ్లుగా ఉన్న కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు వంటి నేతలు సైతం స్పందించలేదు. దానిని తలచుకునే రోజా ఎక్కువగా బాధపడుతున్నారు.

    అయితే రోజా స్వయంకృతాపంతోనే ఈ పరిస్థితిని తెచ్చుకున్నారని వైసీపీలో సైతం కామెంట్స్ వినిపిస్తున్నాయి. టిడిపి ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురయ్యాను అన్న ఒకే ఒక్క అవమానంతో రోజా రగిలిపోయేవారు. వైసిపి అధికారంలోకి వచ్చింది మొదలు టిడిపికి చుక్కలు చూపిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లతో పాటు టిడిపి నేతలను ఎవరిని విడిచిపెట్టట్లేదు. అసెంబ్లీ తో పాటుబయట వేదికలపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.చివరకు తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం రాజకీయాల గురించి మాట్లాడేవారు. అవన్నీ ఇప్పుడు ప్రతికూల అంశాలుగా మారుతున్నాయి.

    రాజకీయాల్లో దూకుడు అవసరమే కానీ.. అది తగిన మోతాదులో ఉంటేనే ఎవరైనా హర్షిస్తారు. దాని స్థాయి మించిపోతే రోజా పరిస్థితి ఇలానే వస్తుంది. టిడిపి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గా ఉన్న రోజా వ్యవహార శైలి తీవ్ర దుమారానికి దారి తీసింది. అసెంబ్లీలో ఆమె ప్రవర్తన అనుచితంగా ఉండేది. అప్పట్లో మహిళా మంత్రుల బాడీ షెమ్మింగ్ పై సైతం మాట్లాడారు. ఇప్పుడు ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత కామెంట్లకు సైతం దిగారు. మహిళా నేతలపై అసెంబ్లీలో చర్చించే సమయంలో ఖండించిన దాఖలాలు లేవు. పైగా బల్ల గుద్దుతూ, వెకిలి నవ్వులతో మద్దతు తెలిపేవారు. మంత్రి రోజా వ్యవహార శైలి చూసిన వైసీపీ సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు లోలోపల బాధపడేవారు. సీఎం జగన్ దృష్టిలో పడేందుకు ఆమె పడే ఆరాటంగా చెప్పుకునేవారు.

    రోజా తో పాటు నలుగురు మహిళా మంత్రులు ఉన్నారు. విడదల రజిని, పసుపులేటి ఉషా చరణ్, తానేటి వనిత మంత్రి పదవులు నిర్వహిస్తున్నా వ్యక్తిగత కామెంట్స్కు మాత్రం దూరంగా ఉన్నారు. తమ పని ఏదో తాము చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పైగా మంత్రి రోజా కంటే.. వారి దగ్గర కీలక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. హోం మంత్రి హోదాలో తానేటి వనిత ఉన్నారు. కానీ ఏనాడు ఆ దర్పంతో మాట్లాడిన సందర్భాలు లేవు. ప్రత్యర్థులపై విధానపరంగా విమర్శలు చేస్తారే కానీ.. వ్యక్తిగత విమర్శలకు దూరం. విడదల రజిని సైతం తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. మంత్రిగా ఎంపికయ్యారు. ఆమె కూడా విధానపరంగానే మాట్లాడతారు కానీ.. నోరు జారిన సందర్భాలు లేవు. పసుపులేటి ఉషా చరణ్ సైతం మృదుస్వభావి. రాజకీయ విమర్శలకు పరిమితం అవుతారన్న మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ రోజా విషయంలో మాత్రంఅలా కాదు. అందుకే రోజాపై వ్యక్తిగత విమర్శలు వచ్చినా పార్టీ కీలక నేతలు స్పందించలేదు. రోజా అంతలా బాధపడడానికి ఇది ఒక కారణం.