Pawan Kalyan: పవన్ ను తక్కువ చేసేందుకు చిరంజీవిని పొగుడుతున్న ఆ నేతలు

తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తును పవన్ ప్రకటించారు. ఇంతవరకు సీట్ల సర్దుబాటు విషయం తేలలేదు కానీ.. పవర్ షేరింగ్ విషయంలో ఇటీవల నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. చంద్రబాబు మాత్రమే సీఎం గా కొనసాగుతారని తేల్చి చెప్పారు.

Written By: Dharma, Updated On : December 26, 2023 4:03 pm
Follow us on

Pawan Kalyan: పవన్ నిర్ణయాలను జనసేన శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. కొందరు ఆయనపై అభిమానంతో మౌనంగా ఉంటున్నారు. మరికొందరు బాహటంగానే విమర్శిస్తూ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కానీ వీటిని పవన్ లైట్ తీసుకుంటున్నారు. కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఇటువంటివి సర్వసాధారణమే అని భావిస్తున్నారు.అయితే ఓ విషయంలో పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవి బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి హయాంలో ఇటువంటివి ఎప్పుడూ ఎదుర్కోలేదని చెప్పుకొస్తున్నారు.

తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తును పవన్ ప్రకటించారు. ఇంతవరకు సీట్ల సర్దుబాటు విషయం తేలలేదు కానీ.. పవర్ షేరింగ్ విషయంలో ఇటీవల నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. చంద్రబాబు మాత్రమే సీఎం గా కొనసాగుతారని తేల్చి చెప్పారు. అప్పటినుంచి జనసేన లో ఉండే కాపు నాయకులు, బయట వివిధ సంఘాల ద్వారా సేవలు అందిస్తున్న వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కాపులకు రాజ్యాధికారం పవన్ ద్వారా వస్తుందని భావించిన వారు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. అంతకుమించి పవన్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. కాపు సంక్షేమ శాఖ వ్యవస్థాపకులు హరి రామ జోగయ్య అయితే పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పవన్ మౌనం కాపు జాతికి ద్రోహం గా పేర్కొన్నారు. పవన్ పై ప్యాకేజీ ముద్ర నిజం అవుతుందని తేల్చి చెప్పారు. అయినా సరే మౌనముద్ర వీడడం లేదు.

పవన్ వైఖరిని నిరసిస్తూ ఉభయగోదావరి జిల్లాలకు చెందిన సీనియర్ నేత మేడా గురుదత్త ప్రసాద్ జనసేన ను వీడారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో గురుదత్త ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పల్లకి మోయడానికి కాపు సామాజిక వర్గాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నావు అంటూ పవన్ ను ప్రశ్నించారు. ఏ నాయకుడైనా తనపార్టీ ఎదగాలని కోరుకుంటారు కానీ.. పవన్ మాత్రం పక్క పార్టీ నాయకుల ఎదుగుదలకు కష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రం బాగు కంటే తనకు ఏ పదవి ముఖ్యం కాదని పవన్ పదేపదే చెప్పడం అర్థం లేదన్నారు. అధికారం వద్దు అని చెబుతున్న పవన్.. తనకు తానుగా సీఎం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. నిలకడ లేని వ్యక్తి పవన్ అని.. ఆయనతో కాపులకు రాజ్యాధికారం వస్తుందని భావించడం భ్రమే అన్నారు.

అయితే ఇలా పార్టీ నుంచి బయటకు వెళ్తున్న వారు పవన్ కంటే చిరంజీవి గొప్పగా కీర్తిస్తున్నారు. చిరంజీవి ద్వారా కాపులకు రాజ్యాధికారం రాకపోయినా.. చాలామంది కాపు నాయకులను జాతికి అందించారని గుర్తు చేస్తున్నారు. పేర్ని నాని, జోగి రమేష్, అవంతి శ్రీనివాస్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకుల ఉన్నతికి చిరంజీవి ప్రజారాజ్యం కారణమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికైతే పవన్ ను తక్కువ చేసి చూపించేందుకుగాను.. చిరంజీవిని గొప్ప వ్యక్తిగా కీర్తిస్తుండడం విశేషం. అయితే ఇదే నేతలు చిరంజీవిని విడిచిపెట్టి వెళ్లడాన్ని ఏమనాలని జనసైనికులు గుర్తు చేస్తున్నారు.