దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ఎన్నికలు పశ్చిమబెంగాల్ లో జరుగుతున్నాయి. హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని ఆశిస్తున్న మమతా బెనర్జీ ఓ వైపు.. బెంగాల్లో పాగావేయడానికి దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న బీజేపీ మరో వైపు.. మూడు దశాబ్దాలపాటు ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని పాలించిన కమ్యూనిస్టుల కూటమి ఇంకోవైపు. వీరిలో ఎవరు అధికారం సాధిస్తారనే ఆసక్తి దేశవ్యాప్తంగా ఉంది.
బెంగాల్ లో మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదు రాష్ట్రాల్లో నాలుగింట ఎన్నికలు ఎప్పుడో ముగిసిపోయాయి. బెంగాల్లో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే.. ప్రధాన పోరు టీఎంసీ-బీజేపీ మధ్యనే అనే ప్రచారం సాగుతున్నప్పటికీ.. కమ్యూనిస్టులను కూడా ఈ సారి తక్కువగా అంచనా వేయలేమని అంటున్నారు విశ్లేషకులు.
కమ్యూనిస్టులు బెంగాల్ ను 33 సంవత్సరాల పాటు ఏకధాటిగా పాలించారు. ఆ తర్వాత మమత అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు రెండు సార్లు తిరుగులేని విజయం నమోదు చేశారు. దీంతో.. జనం పాలనను బేరీజు వేసుకోవడం సహజం. అదే సమయంలో కమ్యూనిస్టులు-కాంగ్రెస్ తోపాటు ముస్లిం పార్టీగా ముద్రపడిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ కూటమిగా ఉన్నాయి. కమ్యూనిస్టులు 171 సీట్లలో, కాంగ్రెస్ 91 స్థానాల్లో మిగిలిన పార్టీ 26 స్థానాల్లో పోటీ చేస్తోంది.
బెంగాల్లో పోరు హోరాహోరీగా సాగుతోందన్నది సత్యం. అయితే.. ఓటరు నాడి ఏంటన్నది చెప్పలేకుండా ఉంది. ప్రధానంగా టీఎంసీ – బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నాయి. అయితే.. గతంలో మాదిరిగా ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితులు కనిపించట్లేదన్నది విశ్లేషకుల మాట.
టీఎంసీ-బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటే.. కమ్యూనిస్టుల కూటమి కూడా మెరుగైన స్థానాలను చేజిక్కించుకునే అవకాశం ఉందంటున్నారు. ఆ విధంగా బెంగాల్ లో హంగ్ ఏర్పడే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇదే జరిగితే.. ఎవరు అధికారం చేపడతారన్నది ఆసక్తికరం. మరి, బెంగాల్ ఓటరు ఎలాంటి తీర్పు చెబుతాడన్నది చూడాలి.