Pawan Kalyan: పవన్ మూడు రోజులపాటు బిజీ బిజీగా గడపనున్నారు. వారాహి నాలుగో విడత యాత్రకు బ్రేక్ ఇచ్చిన పవన్ రాజకీయ సమీక్షలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే అనారోగ్య సమస్యలతో ఆ సమావేశాలు సైతం వాయిదా పడ్డాయి. కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకున్న పవన్ ఈరోజు మంగళగిరి కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం గుండా మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్.. పార్టీ సమీక్షలతో బిజీగా ఉన్నారు.
ఈనెల 5న వారాహి యాత్రకు పవన్ తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈనెల 12 వరకు పార్టీ సమీక్షలు కొనసాగించి.. తర్వాత సినిమా షూటింగ్లకు హాజరుకావాలని భావించారు. కానీ వైరల్ ఫీవర్ తో బాధపడుతుండడంతో విశ్రాంతి తీసుకున్నారు. ఈ మూడు రోజులపాటు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులతో వరుసగా భేటీ కానున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు సమన్వయం, ఓట్లు, సీట్ల బదలాయింపులు, రెండు పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జనసేన బలాబలాలపై సమీక్ష జరపనున్నారు. అదే సమయంలో బలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించనున్నారు. టిడిపి సమన్వయ కమిటీ ప్రకటనతో తదుపరి కార్యాచరణ పై పార్టీ శ్రేణులతో చర్చించనున్నారు. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. తెలుగుదేశం, జనసేన ల మధ్య పొత్తు విచ్ఛిన్నానికి జరుగుతున్న ప్రయత్నాలను.. వాటిని ఎలా తిప్పి కొట్టాలో వివరించనున్నారు. అలాగే తెనాలిలో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయాన్ని పవన్ ప్రారంభించనున్నారు.
ఈనెల 20న విదేశీ పర్యటనకు పవన్ కుటుంబ సమేతంగా వెళ్ళనున్నారు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం యూరప్ లో జరగనుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ యూరప్ వెళ్ళింది. ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఈనెల 20న పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో యూరప్ బయలుదేరి వెళ్ళనున్నారు. 26న తిరిగి ఇండియా చేరుకునే అవకాశం ఉంది. ఆయన వచ్చిన తర్వాతే వారాహి నాలుగో విడత యాత్ర షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.