Sankranti Festival : దట్టంగా కురిసే మంచు.. ఇంటికి వచ్చే పంటలు.. చుట్టపు చూపుగా పలకరించే సూర్యుడు.. ఇలాంటి సందర్భంలోనే సంక్రాంతి పండుగ వస్తుంది. పండుగ అంటేనే సందడి..అందులోనూ తెలుగు ప్రజలు అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. ఇక సంక్రాంతిని మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటున్నా.. పండుగ వాతావరణం మాత్రం వారం ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైంది. తెలుగు లోగిళ్ళలో సంక్రాంతికి మాత్రం ప్రత్యేకమైన వంటకాలు ఉంటాయి. పండుగ వేళ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు కమ్మని పిండి వంటకాలను ఆరిగించి సంతోషంగా గడుపుతారు. ఈనేపథ్యంలోనే ప్రాంతాలను బట్టి పండుగకు రకరకాల పిండి వంటలు తయారు చేసుకుంటారు. అందరూ అరిసెలను వండుకోవటం ఆనవాయితీ కాగా వాటితో పాటు సకినాలు, గారెలు, లడ్డూలు, మురుకులు.. ఇలా రకరకాల వంటలను తయారు చేసుకోవటం పరిపాటి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పేద, ధనికులు ఇలా అన్ని వర్గాల ప్రజలు తమ స్థాయిని మించి కూడా వంటలు చేసుకుంటారు. కొత్త పంటలు రావటంతో రైతులు కూడా ఆనందంతో పండుగను జరుపుకుంటారు.
సామూహికంగా పిండి వంటల తయారీ
మామూలు పండుగకు వంటలు చేసుకోవాలంటే ఇంట్లో వారే తయారు చేసుకుంటారు. కానీ సంక్రాంతి పండుగకు పిండి వంటలు తయారు చేయాలంటే మాత్రం కనీసం నాలుగురైదుగురు ఉండాలి. ప్రధానంగా అరిసెలు, ఇతర వంటలు చేయాలంటే మహిళలు ఒకరి సహకారం ఒకరు తీసుకుంటూ వంటలు వండుకుంటారు. అరిసెలు, లడ్డూలు తయారు చేయటానికి ఇరుగు పొరుగు మహిళల సహకారం తీసుకుంటూ సరదగా కబుర్లు చెప్పుకుంటూ పిండి వంటలను పూర్తి చేస్తారు. వండిన వంటలు కనీసం పక్షం రోజులు తినేలా వండుకుంటారు. వంటల సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో సందడి సందడి నెలకొంటుంది. వారం ముందు నుంచే రోజూ ఒకరి ఇంట్లో వంటలు వండటం చేపడతారు.
పిండి మిల్లులకు గిరాకి
పిండి వంటలకు ప్రధానంగా కావాల్సింది బియ్యం పిండి. అరిసెలు, గారెలు, సకినాలతో పాటు ఇతర వంటలకు బియ్యం పిండి అవసరం. ఇందులోనూ తడి, పొడి బియ్యాన్ని ఆడించి పిండి వంటలను వండుతారు. బియ్యం, పచ్చిశనగపప్పును ఆడించి పిండి వంటలు తయారు చేస్తారు. ఈనేపథ్యంలో ప్రస్తుతం పిండి మిల్లుల వద్ద ఖాళీ లేకుండా ఉంది. పట్టణాల్లో పలు ప్రాంతాల్లో పిండి మిల్లులు ఉంటాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒకటి రెండుకి మించి పిండిని ఆడించే మిల్లులు ఉండవు. దీంతో ప్రస్తుతం మిల్లులకు గిరాకి నెలకొంది.
పెరిగిన ధరలతో ఇబ్బందులు
కొంతకాలంగా నిత్యావసర ధరలు పేదోడికి చుక్కలను చూపెడుతున్నాయి. అయినా పండుగ నేపధ్యంలో వంటలు తప్పనిసరిగా చేసుకోవాలి కాబట్టి భారం అయినా తప్పటం లేదు. ప్రస్తుతం ఇంట్లో మూకుడు పెట్టాలంటే కనీసం రూ.వెయ్యి లేనిది ఏ వంట చేయలేని పరిస్థితి. ఒకస్థాయిలో వంటలు చేయాలంటే కనీసం రూ.2వేల నుంచి రూ.4వేల వరకు అవుతున్నాయి. ప్రస్తుతం నూనె ధర రూ.100 నుంచి రూ.170 వరకు ఉంది. శనగపిండి కిలో రూ.90, శనగపప్పు రూ.90,నువ్వులు రూ.220, బెల్లం రూ.60 ఇలా వంటలకు వాడే సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయి. ధరలు పెరిగినా ఏమాత్రం వెరవకుండా పండుగ ఆనవాయితీని పోనియకుండా ప్రతి ఇంటా తమకు ఇష్టమైన వంటలను చేసుకుంటున్నారు.