
Poster War: గత కొద్ది రోజులుగా అధికార భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్య పోస్టర్ల యుద్ధం సాగుతోంది.. తెలంగాణ అభివృద్ధికి మీరు అడ్డంకిగా నిలుస్తున్నారు అని భారత రాష్ట్ర సమితి దుయబడుతోంది. సాక్షాత్తు ప్రధానమంత్రి ఫోటో పెట్టి పోస్టర్లు అంటిస్తోంది. దీనిని అధికార పార్టీ మీడియా బలంగా ప్రచారం చేస్తోంది. ఈ స్థాయిలో కౌంటర్ భారతీయ జనతా పార్టీ ఇవ్వలేకపోతోంది. అయితే ఇన్నాళ్లు ఈ వ్యవహారాన్ని పరీక్షించిన కేంద్రం.. ఈసారి భారత రాష్ట్ర సమితికి దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చింది.
” రాష్ట్ర రోడ్లు, శాఖలోని కార్యాలయాల మధ్య నెలకొన్న అంతర్గత కొమ్ములాటల కారణంగా తెలంగాణలోని పలు జాతీయ రహదారులు, ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయి. మీ ఆర్ అండ్ బి కార్యాలయాలే దానితో ఒకటి గొడవ పడుతున్నాయి. మీ గొడవలతో జాతీయ ప్రాజెక్టులను యుద్ధక్షేత్రాలుగా మార్చొద్దు.” అని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖకు చురకలు అంటించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా, హైవేల శాఖకు చెందిన హైదరాబాద్ ప్రాంతీయ అధికారి ఎస్.కె కు శ్వాహా ఆర్ అండ్ బి శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు కు ఘాటైన లేఖ రాశారు.
” కొద్దిరోజుల క్రితం హైదరాబాదులో భారత రాష్ట్ర సమితి నాయకుల పోస్టర్లను చూశాను ఇది కరెక్ట్ కాదు. కేంద్రం నుంచి జాతీయ రహదారుల ప్రాజెక్టులకు అనుమతులు పొందేందుకు మీ స్థాయిలో సహకరిస్తున్నా… మీ కిందిస్థాయి కార్యాలయాల మధ్య నెలకొంటున్న అంతర్గత కొమ్ములాటలతో ఆ ప్రాజెక్టులు పెండింగ్లో పడుతున్నాయి.. దీనికి కేంద్రాన్ని నిందించి ఏం ఉపయోగం? ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత మీపై ఉంది కదా? మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ” లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఐదు నేషనల్ హైవే ప్రాజెక్టుల పనులు మందకోడిగా సాగుతున్నాయి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ లోని ఫ్లై ఓవర్ పనులు ఐదు సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా పూర్తి కాలేదు అంటూ పది రోజుల క్రితం ఆ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోడీ పోస్టర్లు వెలిశాయి..అయితే కుస్వాహా తన లేఖలో ప్రస్తావించిన ఐదు జాతీయ ప్రాజెక్టుల్లో అది కూడా ఒకటి. ఈ రగడ జరిగేందుకు ముందే ఆయన ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా కేంద్రానిదే తప్పంటూ భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.
ఇక కుస్వాహా లేఖలో పేర్కొన్న పెండింగ్ ప్రాజెక్టుల్లో హైదరాబాదులోని హైటెక్ సిటీ చుట్టు పక్కల ఉన్న అరామ్ ఘర్_ శంషాబాద్ లోని ఎన్ హెచ్ 44 ఆరు లైన్ల రహదారి, ఎన్ హెచ్ 163 పై నిర్మించనున్న అంబర్పేట ఎలివేటెడ్ ఫ్లైఓవర్, ఎన్ హెచ్ 163 లోని ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్, ఎన్ హెచ్ 63 లో ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు నిర్మించనున్న లైన్ల రోడ్డు పనులు ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రంలోని ఆర్ అండ్ బి శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందిపై ఒత్తిడి పెరగడంతో పనుల్లో జాప్యం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని కప్పిపుచ్చుకునేందుకు భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం కేంద్రంపై ఆరోపణలు చేస్తోందని బిజెపి నాయకులు అంటున్నారు.. ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎన్ హెచ్ 65లోని పూణే హైదరాబాద్ మార్గంలో భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వద్ద నిర్మించనున్న ఫ్లై ఓవర్ పనులపై కూడా పడుతోందని బిజెపి నాయకులు అంటున్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తే అది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుందని బిజెపి నాయకులు అభిప్రాయపడుతున్నారు.. మరి ఈ విషయంపై అధికార భారత రాష్ట్ర సమితి నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.