Bandi Sanjay: బండి సంజయ్‌ ఓటమికి అసలు కారణం ఇదే!

ఎంఐఎం వ్యతిరేకి, హిందూ పక్షపాతిగా ముద్రపడిన బండి సంజయ్‌ కుమార్‌ కరీంనగర్‌లో గెలవకుండా చూడాలనే ముస్లిం మైనార్టీల బలమైన సంకల్పమే కరీంనగర్‌ అసెంబ్లీ స్థానంలో తాజాగా గంగుల కమలాకర్‌ విజయానికి దోహదపడింది.

Written By: Raj Shekar, Updated On : December 9, 2023 3:44 pm

Bandi Sanjay

Follow us on

Bandi Sanjay: కరుడుగట్టిన హిందూవాదిగా, భారత మాత బిడ్డగా, ఎంఐఎం వ్యతిరేకిగా ముద్రపడిన నేత బండి సంజయ్‌. ఎంపీగా ఎన్నికైనా.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతుల నిర్వహించినా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినా.. తను నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రం విస్మరించలేదు. హిందూ ఇజమే తన నైజమని చాటుకున్నారు. పాత బస్తీలోని చార్మినార్‌ మహాలక్ష్మి ఆలయం నుంచే ప్రజాసంగ్రామయాత్రకు శ్రీకారం చుట్టి.. హిందూ పక్షపాతిగా మరోసారి నిరూపించుకున్నారు. కరీంనగర ఎమ్మెల్యేగా మూడుసార్లు పోటీ చేశారు. మూడుసార్లు ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018, 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మూడుసార్లు గంగుల కమలాకర్‌ చేతులో ఓడిపోయారు. అయితే మూడుసార్లు ఓటింగ్‌ శాతం మాత్రం పెరుగుతూ వస్తోంది. తాజాగా విజయం అంచుల వరకూ వచ్చి కేవలం 3 వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు.

కలిసికట్టుగా ఓడిస్తున్న మైనార్టీలు..
ఎంఐఎం వ్యతిరేకి, హిందూ పక్షపాతిగా ముద్రపడిన బండి సంజయ్‌ కుమార్‌ కరీంనగర్‌లో గెలవకుండా చూడాలనే ముస్లిం మైనార్టీల బలమైన సంకల్పమే కరీంనగర్‌ అసెంబ్లీ స్థానంలో తాజాగా గంగుల కమలాకర్‌ విజయానికి దోహదపడింది. నువ్వా నేనా అన్నట్లు పోటీపడి హోరాహోరీ సాగిన ఈ ఎన్నిక ఫలితాలు చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగినా.. చివరికి 3,613 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ విజయం సాధించారు.

అన్ని సర్వేలు సంజయ్‌కే మొగ్గు..
ఎన్నికలకు ముందు ప్రీపోల్‌ సర్వేలో.. పోలింగ్‌ తర్వాత ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో బండి సంజయ్‌కే విజయావకాశాలు ఉన్నాయని దాదాపు అన్ని సర్వే సంస్థలు తెలిపాయి. ఈసారి గంగులకు ఓటమి తప్పదని తేల్చాయి. బీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకతతోపాటు గంగుల కమలాకర్, ఆయన అనుచరుల ఆగడాలు పెరగడం, వరుసగా నాలుగుసార్లు గెలిచి అహంకారపూరితంగా మాట్లాడడం, మంత్రి అలయ్యాక కబ్జాలు, కమీషన్లు, ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలు ఇలా అన్నీ గంగులను ఓడిస్తాయని అంచనా వేశారు. కానీ, బండి సంజయ్‌ వీక్‌పాయింట్‌.. గంగులకు బలంగా మారింది. సంజయ్‌ వ్యతిరేకులను ఐక్యం చేసి చివరి నిమిషంలో గండం గట్టెక్కాడు గంగుల కమలాకర్‌.

34 డివిజన్లలో బీజేపీకే ఆధిక్యం..
కరీంనగర్‌ పట్టణం ఎప్పుడూ బండి సంజయ్‌కు అండగా నిలుస్తోంది. ఈసారి కూడా బండికి నగరపాలక సంస్థ పరిధిలోని 34 డివిజన్ల ఓటర్లు స్పష్టమైన ఆధిక్యం ఇచ్చారు. బీఆర్‌ఎస్‌కు కేవలం 26 డివిజన్లలోనూ ఆధిక్యం వచ్చింది. ఈ 26 డివిజన్లు కూడా మైనారిటీలు ఎక్కువగా ఉన్నవే కావడం గమనార్హం. ఆ డివిజన్లలో కూడా బీఆర్‌ఎస్‌కు ఆధిక్యం తక్కువగానే వచ్చింది.

ఓ వర్గానికి రూ.2 కోట్ల తాయిలం.. ?
కరీంనగర్‌లో ఈసారి పోలింగ్‌ శాతం బాగా తగ్గింది. గంగుల కమలాకర్‌పై అన్నివర్గాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉండడంతో ఓటింగ్‌కు కూడా చాలా మంది దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో పోలింగ్‌ సరళిని ఉదయం నుంచి గమనించిన కమలాకర్‌.. ఇలా అయితే ఓటమి తప్పదని భావించారు. ముఖ్యమంగా మైనారిటీలు ఎక్కువగా ఉండే డివిజన్లలో పోలింగ్‌ శాతం బాగా తక్కువగా నమోదైనట్లు గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన గంగుల కమలాకర్‌.. మైనారిటీ పెద్దలకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ముస్లింలు అందరూ పోలింగ్‌లో పాల్గొనేలా చూడాలని కోరారు. ఒక దశలో బతిమిలాడారు. కానీ, ఆయనపై ఉన్న వ్యతిరేకతతో ఓటు వేయమని చెప్పడానికి పెద్దలు ససేమిరా అన్నారు. దీంతో తన ఆర్థిక బలాన్ని ఎరగా వేశాడనీ సమాచారం. నగరంలోని మసీదుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు.. అప్పటికప్పుడు రూ.2 కోట్లు మైరానిటీలకు చెందిన ఖతాకు ట్రాన్స్‌ఫర్‌ చేయించినట్లు తెలిసింది. దీంతో మధ్యాహ్నం 3 గంటల తర్వాత మైనారిటీ డివిజన్లలో పోలింగ్‌ పెరిగింది. ఇదే గంగుల విజయానికి, బండి సంజయ్‌ ఓటమికి కారణం అయినట్లు తెలుస్తోంది.