Modi and Amit Shah – Chandrababu: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో మిత్రపక్షాల బలంతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ..2019లో మాత్రం ఏకపక్ష విజయంతో అధికారంలోకి రాగలిగింది. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం అది కుదిరే పనిగా లేదు. వరుసగా పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కారణంగా ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో సీట్లు గణనీయంగా తగ్గుముఖం పడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికలపై బీజేపీ అగ్రనేతలు ఫోకస్ పెంచారు. ఇప్పటివరకూ అధికారంలో రాని 150 లోక్ సభ స్థానాలపై గురిపెట్టారు. ఎలాగైనా విజయం సాధించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉండడం విశేషం. అయితే 2014 మాదిరిగా ఎన్డీఏ మిత్రపక్షాలు లేకపోవడం మైనస్ పాయింట్ గా మారింది. నాడు ఎన్డీఏలో టీడీపీ, శివసేన, జేడీఎస్, శిరోమణి అకాలీదళ్ వంటి బలమైన పార్టీలుండేవి. కానీ 2019 ఎన్నికల ముందు, తరువాత చాలా రాజకీయ పక్షాలు చేయిదాటిపోయాయి. ఇప్పుడు ముందస్తు చర్యల్లో భాగంగా వాటిని తిరిగి చేర్చుకునేందుకు బీజేపీ కేంద్ర పెద్దలు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు పట్ల సానుకూలత చూపినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

బీజేపీ పెద్దల అభిప్రాయం ప్రకారం ఇప్పుడున్న స్థానాల్లో సుమారు 70 నుంచి 80 వరకూ తగ్గిపోతాయని అంచనా వేస్తున్నారు. వీటిని భర్తీ చేసుకోవడానికి పార్టీ సొంతంగా బలం పెంచుకోవడం ఒక ఎత్తయితే …మిత్రపక్షాల ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవడం మరో పద్ధతి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలు తమ ఆపరేషన్ ను ప్రారంభించారు. అటు టార్గెట్ ఫిక్స్ చేసిన నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తూనే దూరమైన మిత్రపక్షాలను దగ్గరకు చేర్చుకునేందుకు పావులు కదపడం ప్రారంభించారు. గతంలో తమతో కలిసి నడిచి.. వివిధ కారణాలతో దూరమైన వారిని దగ్గర చేసుకునేందుకు వారు సిద్ధపడుతున్నారు.
Also Read: Pawan Kalyan Tweet: ఆ ఆలోచన రెప్పపాటులో కార్చిచ్చులా వ్యాపిస్తుంది.. పవన్ కళ్యాణ్ వీరావేశం ఎవరిపై ?
తమిళనాడులో తన మిత్రపక్షమైన అన్నాడీఎంకే, మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన, అథావలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ, పంజాబ్ లోని అమరిందర్ సింగ్ ఆధ్వర్యంలో లోక్ కాంగ్రెస్, బీహార్లోని లోక్ జనశక్తి, అసోంలోని అస్సాం గణపరిషత్, హర్యానాలోని జన నాయక్ జనతా పార్టీ, ఉత్తరప్రదేశ్ లోని అప్నాదళ్, ఏపీలో టీడీపీ, జనసేనతో కేంద్ర పెద్దలు కలిసి ప్రయాణించడానికి దాదాపు సిద్ధమయ్యారు.

దాదాపు బీజేపీ ప్రాంతీయ పార్టీలతోనే కలిసి నడవాలని నిర్ణయించుకోవడం వెనుక పెద్ద కథ ఉంది. ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రాల్లో అధికారమే ప్రధానం. ఎంపీ సీట్లకు అంతగా ప్రాధాన్యత ఇవ్వవు. అందుకే వీటితో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా ఎంపీ సీట్లను అత్యధికంగా దక్కించుకోవచ్చన్నది బీజేపీ భావన. ప్రస్తుతం ఏపీలో 25 ఎంపీ స్థానాలున్నాయి. ఇందులో ప్రస్తుతం 22 లోక్ సభ సీట్లు వైసీపీ చేతిలోనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కానీ పొత్తు కుదిరితే మెజార్టీ ఎంపీ స్తానాలు బీజేపీ కోరే అవకాశముంది. అదే సమయంలో అసెంబ్లీ స్థానాల విషయానికి వచ్చేసరికి మాత్రం బీజేపీకి తక్కువ ఇచ్చే అవకాశముంది. తద్వారా కేంద్రంలో బలం పెంచుకోవడం బీజేపీకి, రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలతో టీడీపీకి లబ్ధి చేకూరనుంది. ఇది ఉభయతారకంగా ఉంటుందని ఇరు పక్షాలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అటు చంద్రబాబు దూతగా రామోజీరావు ఇదే మాటను అమిత్ షా చెవిలో పడేసినట్టు అప్పట్లోనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఇప్పటికే టీడీపీ, బీజేపీల మధ్య ఒప్పందం జరిగిపోయిందన్న టాక్ అయితే మాత్రం వినిపిస్తోంది.
Also Read:Pawan Kalyan Tweet: ఆ ఆలోచన రెప్పపాటులో కార్చిచ్చులా వ్యాపిస్తుంది.. పవన్ కళ్యాణ్ వీరావేశం ఎవరిపై ?