Free Electricity: తెలంగాణలో ఉచిత విద్యుత్ అమలుపై ప్రభుత్వ వ్యూహం ఇదే..

కర్ణాటకలో ఉచిత విద్యుత్‌ అమలు తీరును అధ్యయనం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ బృందం ఫిబ్రవరి 3న బెంగళూరుకు వెళ్లింది. అక్కడ బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్‌తో చర్చలు జరిపింది.

Written By: Raj Shekar, Updated On : February 4, 2024 11:10 am
Follow us on

Free Electricity: తెలంగాణ ప్రభుత్వం మరో రెండు గ్యారంటీల అమలుకు కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావడంతో వాటి అమలుకు విపక్షాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ క్రమంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్ అమలు చేసేందుకు రేవంత్‌ సర్కార్‌ కసరత్తు చేపట్టింది. ఉచిత విద్యుత్‌పై అధ్యయనం చేస్తోంది.

బెంగళూర్‌కు టీం..
కర్ణాటకలో ఉచిత విద్యుత్‌ అమలు తీరును అధ్యయనం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ బృందం ఫిబ్రవరి 3న బెంగళూరుకు వెళ్లింది. అక్కడ బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్‌తో చర్చలు జరిపింది. మన సంస్థకు ఎండీ, చైర్మన్‌ ముషరఫ్‌ ఫారుఖీ అధ్యక్షత వహించారు. కర్ణాటకలో ఉచిత విద్యుత్‌ పథకం విజయవంతంగా అమలవుతోంది. అక్కడ 1.65 కోట్ల మందికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తోంది అక్కడి ప్రభుత్వం ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఏటా రూ.13,910 కోట్ల భారం పడుతోంది. ఈ వివరాలను మన బృందం తెలుసుకుంది. తెలంగాణ ఐఏఎస్‌ అధికారి ముషారఫ్‌ ఫరూఖీ, బెస్కామ్‌ ఎండీ మహతేష్‌ బిలాగి, డైరెక్టర్‌ ఫైనాన్స్‌ ధర్‌జన్‌ జె, ఐటీ, రెవిన్యూ విభాగం అధికారులతో చర్చించారు.

గృహజ్యోతి పేరిట..
తెలంగాణలో 200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందే హామీ ఇచ్చింది. గృహజ్యోతి గ్యారంటీలో దీనిని చేర్చింది. ఈ క్రమంలోనే కర్ణాటకలో అమలు తీరు తెలుసుకునేందుకు అధికారుల బృందాన్ని పంపించింది.

తెల్ల రేషన్‌ కార్డు ఉన్నవారికే..
తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికే ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఇంద్రవెల్లి సభలో ప్రకటించారు. ఆ లెక్కన ప్రభుత్వం ఏడాదికి రూ.4 వేల కోట్లు ఈ పథకానికి కేటాయించాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో అమలు చేస్తామని చెప్పినా సాధ్యం కాలేదు. దీంతో ఆదివారం జరిగే భేటీలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

గతంలో వైఎస్సార్‌..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్‌ పథకం తెచ్చారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దానిని కొనసాగించింది. 9 గంటల విద్యుత్‌ను 23 గంటలకు పెంచింది. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. మార్చి నుంచి అమలు చేసే అవకాశం ఉంది.