
AP Politics : ఏపీ రాజకీయాల్లో హుందాతనం తగ్గింది. మాటకు మాట.. చేతకు చేత.. సెల్ఫీకి సెల్ఫీ అన్నట్టు వాతావరణం సాగుతోంది. ఎక్కడ స్టడీ చేసి విధానపరంగా విమర్శలకు దిగే పరిస్థితి లేదు. అంతా వ్యక్తిగత టార్గెట్ గా ఉంది. చివరకు అభివృద్ధి పనుల్లో పోటీ సవాళ్లు కూడా పక్కదారి పడుతున్నాయి. చివరకు అవి పర్సనల్ కామెంట్స్ వైపే మళ్లుతున్నాయి. వాస్తవాలు ఏంటి? ఎవరి హయాంలో ఏం జరిగింది? ఎటువంటి ప్రాజెక్టులు తెచ్చారు? అన్నది ప్రజలకు కన్ఫ్యూజన్ గా మారిపోతోంది. అయితే ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య జరుగుతున్న జుగుప్సాకర సంబాషణ రాజకీయాల్లో హుందాతనం తగ్గిస్తోంది. కేవలం వ్యక్తిగత, వ్యక్తిత్వ హననానికి పెద్దపీట వేస్తున్నారు. రాజకీయాలను రోత పుట్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని సరికొత్త వాతావరణాన్ని చూపిస్తున్నారు. గతంలో తమిళనాడు మాదిరిగా రాజకీయాలు నెరుపుతున్నారు.
కాకరేపుతున్న సెల్ఫీ పాలిటిక్స్..
ఇప్పుడు కొత్తగా ఏపీలో సెల్ఫీ పాలిటిక్స్ కాకరేపుతున్నాయ్. అటు చంద్రబాబు, ఇటు లోకేశ్ టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అధికార వైసీపీకి సవాళ్లు విసరడంతో పొలిటికల్ సెగలు రాజుకున్నాయ్. అదే స్థాయిలో అధికార పార్టీ తరపున మంత్రులు కౌంటర్లు విసరడంతో మేటర్ సీరియస్‌గా మారుతోంది. మంత్రి అప్పలరాజు అయితే ఏకంగా జగన్ మాస్కు ధరించి సెల్ఫీ చాలెంజ్ విసిరారు. నిర్మాణంలో ఉన్న ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఎదుట సెల్ఫీకి దిగి ఏకంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు సవాల్ చేశారు. అయితే అది టీడీపీ హయాంలో మంజూరు కావడం, నాలుగేళ్లుగా పనులు జరుగుతున్నా ఇంకా 30, 40 శాతం పనులు మిగిలి ఉండడంతో అప్పలరాజుకు తిరిగి సెటైర్లు పడుతున్నాయి.
తడబడుతున్న పార్టీలు..
అయితే ప్రజలకు వాస్తవాలు చెప్పే క్రమంలో పొలిటికల్ పార్టీలు తడబడుతున్నాయి. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా ఎటువంటి అభివృద్ధి లేదు. అంతా సంక్షేమ తారక మంత్రమే నడిచింది. బటన్ నొక్కుడు, పథకాలు పంపిణీయే జరిగింది. దీంతో అభివృద్ధి పడకేసింది. అందుకే విపక్షాల సెల్ఫీలకు చిత్రాలు చిక్కుతున్నాయి. అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. మారమూల గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపాటి సమస్యలను సైతం సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి ప్రచారం చేస్తున్నారు. కానీ వాటికి ధీటైన సమాధానాలు చెప్పే క్రమంలో అది గత ప్రభుత్వ వైఫల్యంగా చెప్పుకొస్తుండడం కూడా విమర్శలకు దారితీస్తోంది. ఆ ప్రభుత్వం బాగాలేకే కదా మీకు అధికారం అప్పగించింది అని ప్రజలు ప్రశ్నించేసరికి వైసీపీ నేతలకు ఏం చెప్పాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు.
ప్రజల్లో కన్ఫ్యూజన్..
అటు విపక్షానిదీఅదే పరిస్థితి. వైసీపీ చెబుతున్న పనులన్నీ.. అవి మా చలువేనని చెబుతున్నారు. చివరకు టిడ్కో ఇళ్లు కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. అటువంటప్పుడు లబ్ధిదారులకు ఎందుకు అందించలేకపోయారు అంటే మౌనమే సమాధానం. వైసీపీ ప్రభుత్వం వచ్చి తాము మంజూరు చేసిన పనులన్నింటినీ రద్దుచేసిందని చెబుతున్నారు. అవన్నీ ఎన్నికల ముందు ప్రారంభించినవి కావా? అంటే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి. తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా ఏపీలో ఈ దరిద్రానికి అధికార, ప్రధాన ప్రతిపక్షం బాధ్యత వహించాల్సి ఉంది. కానీ రోత మాటలతో తప్పు మీదంటేమీది అంటూ దరిద్రపు లెక్కలతో కాలం గడిపేస్తున్నారు. ప్రజలకు మాత్రం కన్ఫ్యూజన్ లో పెట్టి రాజకీయ లబ్ధికి ఆరాటపడుతున్నారు.