CM Jagan: మొన్నటి వరకూ వైసీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. పార్టీ అధినేత మాటే శిరోధార్యం. ఆయన గీసిన గీతను దాటే పరిస్థితి ఉండేది కాదు. అటువంటి పార్టీలో ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట అసంతృప్తి రాగాలు వినిపిస్తునే ఉన్నాయి. పార్టీలో వీధి పోరాటాలు వెలుగుచూస్తున్నాయి. ఎందుకీ పరిస్థితి అని ఆలోచించినలోపే ధిక్కార స్వరాలు పెరిగి హైకమాండ్ కు కలవరానికి గురిచేస్తున్నాయి. కంటగింపుగా మారాయి. అయితే ఒక్కసారిగా ఎదురుపడుతున్న ప్రతికూల పరిణామాలను చూసి జగన్ అలెర్టయ్యారు. ఓ కీలక నిర్ణయం తీసుకొని పని మొదలుపెట్టేశారు.
ప్రస్తుతానికి ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల మాత్రమే వెలుగులోకి వచ్చారు. కానీ ఈ జాబితా మూడు పదులు దాటినట్టు ప్రచారం సాగుతోంది. అసంతృప్త స్వరాలు బయటపడుతున్న తరుణంలో జగన్ ఒక రహస్య సర్వే చేయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ తీరుపై ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు? మంత్రి పదవి రాలేదని బాధపడుతున్న వారెవరు? విపక్షాలతో ఎవరెవరు సంబంధాలు నెరుపుతున్నారు? అని ఆరాతీశారు. దాదాపు అన్ని జిల్లాల్లో సర్వే సంస్థలు, నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో.. ఆ మార్గం ద్వారా కూడా అసంతృప్త ఎమ్మెల్యేలను గుర్తించినట్టు సమాచారం.
అయితే ఇలా చేసిన సర్వేల్లో షాకింగ్ విషయాలు బయటపడినట్టు సమాచారం. పార్టీ అన్నా.. పార్టీ అధినేత అన్నా వీర విధేయత ప్రదర్శించే కీలక నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 35 మంది ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా మారారని.. వారంతా ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సర్వేలో తేలినట్టు ప్రచారం జరుగుతోంది. సదరు ఎమ్మెల్యేల జాబితా చూసి జగన్ నివ్వెరపోయినట్టు టాక్ నడుస్తోంది. అప్పటి నుంచే జగన్ నైరాశ్యంలోకి వెళ్లిపోయారని.. కొత్తగా వైరాగ్య వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
అసంతృప్త ఎమ్మెల్యేలకు ప్రత్యమ్నాయ నాయకత్వం సిద్ధం చేసే పనిలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ నియోజకవర్గంలో జనాదరణ ఉన్న నాయకుడెవరు? టిక్కెట్ ఇస్తే రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టేవారెవరు? పేరుమోసిన డాక్టర్లు ఎవరైనా ఉన్నారా? లేక నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ వంటి వారి వివరాలను ఆరా తీస్తున్నట్టు సమాచారం. అటువంటి వారి జాబితా ఇప్పటికే సిద్ధమైందని..ఎమ్మెల్యేలు పార్టీ మారిన సంకేతాలు వచ్చే మరుక్షణమే నియోజకవర్గ ఇన్ చార్జి పోస్టులో నియమించాలని డిసైడ్ అయినట్టు విశ్లేషణలు వెలువడుతున్నాయి.