Vijayasai Reddy: వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయ ప్రత్యర్థులను కలుస్తారా? వైసీపీని విభేదించే వారిని సైతం కలవడానికి ఇష్టపడతారా? ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పిన దాంట్లో నిజం ఉందా? ఆయనను సైతం విజయసాయి కలిశారా?ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో తనపై ఏదో కథనం రాశారని విజయసాయిరెడ్డి తెగ ఫీల్ అయ్యారు. వెంటనే రాధాకృష్ణపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు.అందులో రాధాకృష్ణ గురించి చాలా అనుచితంగా మాట్లాడారు. అయితే దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు రాధాకృష్ణ.మొత్తం తన వీకెండ్ కామెంట్లో విజయసాయిరెడ్డిని ఓ రేంజ్ లో వేసుకున్నారు. చివరకు ఆయనను ఒక వేశ్యతో పోల్చారు. తనను తరచూ కలుస్తుంటారని చెప్పుకొచ్చారు. ఏ కారణాలతో కలుస్తారో మాత్రం చెప్పడంఅనైతికం కాబట్టి చెప్పబోనని అన్నారు. దీంతో వైసీపీలో కొత్త అనుమానాలను రేకెత్తించారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. అటు తిరిగి ఇటు తిరిగి పరిణామం వైసీపీలో ఒక రకమైన అయోమయానికి కారణం అయ్యింది.
* అధినేతకు వీర విధేయుడు
వైసీపీ అధినేత జగన్ కు విజయసాయిరెడ్డి విధేయుడు. వైసిపి ఆవిర్భావానికి ముందే ఆయన వద్ద పనిచేసిన ఆడిటర్. అందుకే జగన్ అవినీతి కేసుల్లో ఎ2గా మారారు. ఆయనతో పాటే జైల్లోకి వెళ్లారు. 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కోసం తన శక్తిని ఉపయోగించారు.కేంద్ర పెద్దల ప్రాపకం వైసీపీకి ఉండాలని నేతలకు సాష్టాంగ నమస్కారాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే విషయాన్ని తాజాగా రాధాకృష్ణ ప్రస్తావించారు.అంత నమ్మదగిన వ్యక్తి సాయి రెడ్డి కాదని సాక్షాత్ హోం మంత్రి అమిత్ షా మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. అయితే ప్రతిరోజు చీకటి పడిన తర్వాత విజయసాయిరెడ్డి చాలామందిని కలుస్తారని సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు వైసీపీలో అనుమానాలు పెరగడానికి అవే కారణాలు అవుతున్నాయి. నెలరోజుల కిందటే తనను విజయసాయిరెడ్డి కలిశారని.. ఎందుకు కలిశారో చెప్పాలని ఆర్కే సవాల్ చేయడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
* చాలా అనుమానాలు, అవమానాలు
గతంలో చాలా సందర్భాల్లో విజయసాయిరెడ్డిని జగన్ అనుమానించారు. అవమానించారు కూడా. వైసిపి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో ఉత్తరాంధ్ర బాధ్యతలను ఆయనకు అప్పగించారు. అయితే ఉన్నపలంగా ఆ బాధ్యతలనుంచి తొలగించి వైవి సుబ్బారెడ్డి కి ఇచ్చారు. ఒకానొక దశలో సాయి రెడ్డి ముసలాడైపోయాడని జగన్ వ్యాఖ్యానించారు కూడా. అయితే ఏం జరిగిందో ఏమో కానీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి వెళ్లిపోవడంతో.. నెల్లూరు నుంచి సాయి రెడ్డిని బరిలో దింపారు జగన్. అంతటితో ఆగకుండా ఎన్నికల అనంతరం తిరిగి ఉత్తరాంధ్ర బాధ్యతలను కట్టబెట్టారు. ఇప్పుడు ఏకంగా రాధాకృష్ణ పుణ్యమా అని విజయసాయి పై అనుమానాలు పెరుగుతున్నాయి. కచ్చితంగా ఇది విస్తృత చర్చకు దారి తీయడం ఖాయం. విజయసాయిరెడ్డి చీకటి మార్గంలో ఎవరెవరిని కలిశారు?ఎందుకు కలిశారు? అన్నది సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది. రాధాకృష్ణ ఇంత రచ్చ చేశాక.. విజయసాయిరెడ్డి స్పందించక అనివార్య పరిస్థితి ఎదురైంది. మరి సాయి రెడ్డి ఏం చెబుతారో చూడాలి.