New Year 2025: కొత్త సంవత్సరం (క్యాలెండర్ ఇయర్) వచ్చిందంటే చాలు సందడి మొదలవుతుంది. దాదాపు నెల రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తారు. ఈ కల్చర్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. న్యూ ఇయర్ సంబురాలకు రీస్టార్టులు, పబ్బులు, మాల్స్, రెస్టారెంట్లు, ఇలా అన్ని సిద్ధం చేస్తారు. మద్యం తాగడం, పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం పరిపాటిగా మారిపోయింది. ఇది పట్టణాలలో అయితే పల్లెటూర్లలో కూడళ్లు కిక్కిరుస్తాయి. దాదాపు గ్రామాల్లోని యూత్ అంతా అక్కడికి చేరి కేరింతలు పెడుతూ డీజేలు పెట్టి డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తారు. న్యూ ఇయర్ వేడుకలు అంటే సంబురాలు మాత్రమే కాదు.. కొన్ని కొన్ని చోట్ల విషాదాలు కూడా జరుగుతుంటాయి. అతిగా మద్యం తాగి వాగ్వాదాలకు దిగి.. దాడులకు పాల్పడడం.. మద్యం తాగిన మత్తులో వేగంగా వాహనాలను డ్రైవ్ చేయడం.. కొన్ని చోట్ల విద్యుత్ షాక్ లు ఇలా చాలా కారణాలతో ప్రాణాలు పోయిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.
అయితే, వీటి నుంచి రక్షణ కల్పించేందుకు ప్రతీ సారి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఆ ఒక్క రోజు వీలైతే మద్యానికి దూరంగా ఉండాలని, ‘లిక్కర్ ఫ్రీ న్యూ ఇయర్’ జరుపుకోవాలని, ఇంకా.. చాలా చాలా రకాలుగా హెచ్చరికలు జారీ చేస్తారు. కానీ వీటిని మాత్రం ప్రజలు పట్టించుకోరు. ముఖ్యంగా యూత్ వీటిని పెడచెవిన పెడుతుంది. దీంతో పోలీసులు కూడా వారి చర్యలకు పదును పెడతారు.
ప్రధాన కూడళ్లు, చౌరస్తాలు, బస్టాండ్లు, వివిధ ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తారు. ఈ రోజును చాలా సీరియస్ గా తీసుకుంటారు పోలీసులు. ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో మరింత సీరియస్ గా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా గత సంవత్సరం (2023) కరీంనగర్ పట్టణంలో డిసెంబర్ 31, 2023లో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో దాదాపు 85 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు.
ఇయర్ రివ్యూలో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ ఈ వివరాలను వెల్లడించింది. గతేడాది డిసెంబర్ 31, 2023 రోజున 85 మందిపై కేసు పెట్టామని ఈ సారి కూడా నగరంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగుబోతులను ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇంటి వద్ద, సంబంధిత ప్రదేశాల్లో మద్యం తాగితే అక్కడే ఉండాలని రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ చేస్తే కూడా కేసు పెడతామని హెచ్చరిస్తున్నారు.
ఏది ఏమైనా పోలీసులు ఇయర్ రివ్యూలో భాగంగా రిపోర్ట్ రిలీజ్ చేయడంతో కొంత వరకు మందుబాబుల వెన్నులో వణుకు పుట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సారి మందు బాబులు కరీంనగర్ పరిసరాల్లో కనిపించకపోవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది.